అన్నీ బంద్‌… కరోనా ఖబడ్దార్‌.. ఖర్చుకు వెనకాడేది లేదు : సీఎం కేసీఆర్‌

-

ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నామని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల అవసరాల కోసం మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు తెరిచే ఉంటాయన్నారు. ఇక పెళ్లిళ్లను ఇంతకు ముందే ఫిక్స్‌ చేసుకున్న వారి కోసం మార్చి 31వ తేదీ వరకే మండపాలు అందుబాటులో ఉంటాయన్నారు.

we do not hesitate about expenditure to face corona says cm kcr

కరోనా వైరస్‌ ప్రభావం తెలంగాణలో లేదని, కేవలం బయటి దేశాల నుంచి వచ్చిన వారితోనే ఆ సమస్య ఉందని కేసీఆర్‌ అన్నారు. మన దేశంలో 83 మందికి కరోనా వచ్చిందని, అందులో 66 మంది భారతీయులు కాగా, 17 మంది విదేశీయులని అన్నారు. జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్‌, జిమ్‌లు, పార్కులు, జూ పార్కులు, స్విమ్మింగ్‌ పూల్స్‌, మ్యూజియం, అమ్యూజ్‌మెంట్ పార్కులు, పబ్బులు, క్లబ్బులు, బార్లను మూసివేయాలని నిర్ణయించామని తెలిపారు.

కరోనా కోసం ప్రాథమికంగా రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నామని, అవసరమైతే ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ చికిత్స కోసం ఇప్పటికే 1020 ఐసోలేషన్‌ బెడ్‌లను సిద్ధం చేశామని, 321 ఐసీయూ బెడ్లను అందుబాటులో ఉంచామని, మరో 240 వెంటిలేటర్లు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా అనుమానితులు, కరోనా పేషెంట్లను క్వారంటైన్‌లో ఉంచేందుకు 4 హాస్పిటళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇక ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో విద్యార్థులు పరీక్షలు అయ్యేంత వరకు అక్కడే ఉండవచ్చని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారి కోసం శానిటైజర్లను ఏర్పాటు చేశామన్నారు.

మార్చి 31వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, వర్క్‌ షాపులు, ర్యాలీలకు అనుమతి లేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇక విద్యార్థులకు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని, ఆర్‌టీసీ బస్సులు, మెట్రో యథావిధిగా నడుస్తాయని తెలిపారు. అయితే ప్రజలు వీలైనంత వరకు బయట తిరగకపోవడమే ఉత్తమమని, జన సమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదని, వదంతులను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news