కరోనా వైరస్‌తో ఖాకీ వైరస్ పోటీ పడుతోందా? ఏపీలో కరోనాను మించి ఖాకీ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలే ఎక్కువగా ఉంటున్నాయా? అంటే.. ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకు లు, సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఔననే అంటున్నారు. గడిచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఒక్కరు మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. అదేసమయంలో ఈ రెండు రోజుల్లోనూ ఖాకీ ధరించిన పోలీసుల కారణంగా అనధికారికంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిందనేది ప్రజల మాట!
ప్రాణాంతక కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అయితే, ఈ లాక్‌డౌన్‌లోనూ కొంత వెసులుబాటు కల్పించి ప్రజలకు నిత్యా వ సరాలు, కూరగాయలు తెచ్చుకునేలా అవకాశం కల్పించింది. అనంతరం లాక్‌డౌన్‌ను విధిస్తోంది. ఈ క్రమం లో పోలీసులు తమ హద్దులు మీరుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. తమ లాఠీలకు పని చెబుతు న్నారు. వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో ఓ దయనీయమైన పరిస్థితి నెలకొంది. కరోనా కారణంగా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అయితే, కొందరు ఏదో ఒక కారణంగా బయటకు వస్తున్నారు.
అలా వచ్చిన వారు రాష్ట్ర జనాభాతో పోల్చుకుంటే 0.02% ఉన్నట్టు అంచనాలు స్పష్టంగా చెబుతున్నా యి. మరి వీరికి తగిన విధంగా సూచనలు చేసి ఇంటికి పంపించాల్సిన పోలీసులు అలా చేయడం మానే సి తమ లాఠీలకు పని చెబుతున్నారు. దీంతో ప్రజలు హడలి పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల్లో కరోనాను మించిన కాఠిన్యం చూపిన కారణంగా ఐదుగురు తమ ప్రాణాలు కోల్పోయారు. ఒకరు పోలీసులు తరుముతుండగా పరిగెత్తి పరిగెత్తి రాయి గుద్దుకుని మృతి చెందారు. బాపట్లలో మరొక యువకుడిని పోలీసులు వేధించడంతో ఉరేసుకుని మృతి చెందారు.
పశ్చిమ గోదావరిలో ఇద్దరు పోలీసులకు భయపడి పరిగెత్తి, పరిగెత్తి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఇంకో కేసులో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో గాయపడి ఒకరు మృతి చెందారు. ఇలా మొత్తంగా ఐదుగురు మృతి చెందడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా పోలీసుల తీరులో ఎక్కడా మార్పు కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ఖాకీ తీరు ఇంకా బ్రిటీష్ హయాంనే తలపిస్తుండడం గమనార్హం.