కరోనాపై పోరు.. చేతులు కలిపిన గూగుల్‌, ఆపిల్‌

-

స్మార్ట్‌ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్న గూగుల్‌, ఆపిల్‌ సంస్థలు.. కరోనాపై పోరాడేందుకు చేతులు కలిపాయి. కరోనాపై పోరాడుతున్న అధికారులకు, ప్రజలకు సాంకేతిక సాయం అందించేందుకు కలిసి పనిచేయాలని ఇరు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కరోనా బాధితుల కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేసేందుకు కలిసి పనిచేయనున్నట్టు ఆ రెండు సంస్థలు ప్రకటించాయి.

‘కొత్త సాంకేతిక విధానాలను రూపొందించడం ద్వారా సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి, ప్రజల ప్రాణాలను రక్షించడానికి సహకరిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో బ్లూటూత్‌ సాంకేతిక పరిజ్లానం ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు వైరస్‌ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడేందుకు ఆపిల్‌, గూగుల్‌ సాయం అందిస్తాయి. అలాగే ఈ సమయంలో వినియోగదారుల గోప్యత, భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తాం’ అని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి.

ఇదే విషయాన్ని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌లు వారి ట్విటర్‌ ఖాతాల ద్వారా వెల్లడించారు. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వల్ల కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చని ఇరువురు అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందకు పనిచేస్తున్న అధికారులకు సాయపడేలా గూగుల్‌, ఆపిల్‌ కలిసి పనిచేస్తాయని సుందర్‌ పిచాయ్‌ చెప్పారు. వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పిస్తూ.. బలమైన కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ విధానాన్ని రూపొందించినట్టు వెల్లడించారు. ఇందుకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌తో కలిసి ముందుకు సాగనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు బ్లూటూత్‌ టెక్నాలజీ ఆధారంగా వైద్యఅధికారులకు సాయం అందిచనున్నట్టు టిమ్ కుక్ చెప్పారు. సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌తో కలిసి పనిచేయనున్నట్టు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news