ఏపీలో ఆసక్తికర విషయం తెరమీదికి వచ్చింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీతో జట్టుకట్టి ఎన్నికలకు వెళ్లిన బీజేపీ.. తర్వాత 2019 సమయానికి యూటర్న్ తీసుకుని వైసీపీతో తెరచాటు.. లోపాయకారీ సయోధ్య చేసుకుందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వని అప్పాయింట్ మెంట్లు జగన్ అలవోకగా సాదించు కున్నారు. సీఎం అయిన కేవలం ఆరు మాసాల్లోనే నాలుగు సార్లు మోడీతో భేటీ అయ్యారు. ఇక, అధికార పార్టీగా వైసీపీ నేతలు బీజేపీపై ఎక్కడా ఒక్క మాట కూడా విమర్శించలేదు. అయితే, బీజేపీ రాష్ట్ర సారధి కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఆది నుంచి కూడా వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.
రాజధాని అమరావతి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. ఒక పక్క పార్టీ హైకాండ్ నేత జీవీఎల్ రాజధాని వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదేనని చెప్పినా.. కన్నా ఖస్సు మన్నారు. అయినా కూడా అప్పట్లో వైసీపీ నేతలు సంయమనం పాటించారు. ఇక, తాజాగా దక్షిణ కొరియా నుంచి తీసుకున్న కరోనా కిట్ల విషయంలో కన్నా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కమీషన్ తీసుకున్నారని, కక్కుర్తి పడ్డారని అన్నారు. దీనిపై వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు అమ్ముడు పోయావని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ విషయాన్నికాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేయాలని కన్నా సవాల్ రువ్వడం, దీనికి ఓకే అని విజయసాయి అనడం కూడా వేగంగానే జరిగిపోయాయి. అయితే, ఇంతలోనే ఓ కథనం వెలుగు చూసింది. బీజేపీ-వైసీపీ మధ్య కేంద్రం స్థాయిలో బంధం చెడిపోతోందని ఓ మీడియా కథనాలు ప్రచురించింది. దీనికి అనుకూలంగా రెండు మూడు రుజువులు కూడా చూపించింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ . తమ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడానికి విజయసాయి ఎవరని నిలదీశారని పేర్కొంది.
అదే సమయంలో మరికొందరుసీనియర్ నేతలు కూడా వైసీపీపై కన్నెర్ర చేశారని, సో.. మొత్తానికి కేంద్రంలోని బీజేపీ.. వైసీపీతో అంతర్గతంగా ఉన్న బంధాన్ని తెగతెంపు లు చేసుకునేందుకు చూస్తోందని వండి వార్చింది. కట్ చేస్తే.. బీజేపీకి ఇలాంటివి చిన్నవని అంటున్నారు పరిశీలకులు. తుమ్మితే ఊడిపోయే అతి స్వల్ప స్థాయిలో బీజేపీ వ్యవహరించదని చెబుతున్నారు. దీనికి వారు చెబుతున్న రుజువులు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో శివసేన పార్టీతో బీజేపీకి ఉన్న బంధం.. అందరికీ తెలిసిందే.
నిత్యం మూడు కలహాలు, ఆరు కయ్యాలు.. అయినా కూడా అక్కడ పార్టీని పొత్తుతోనే నడిపిస్తున్న విషయాన్ని చెబుతున్నారు. అదే సమయంలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, అయినా.. ఒక ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన చిన్న గ్యాప్‌ను బీజేపీ పెద్దది చేస్తుందని, మొత్తంగా పార్టీతోనే కటీఫ్ పెట్టుకుంటుందని అనుకోవడం సమంజసం కాదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.