కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక, ఉద్యోగాలను కోల్పోయి.. వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్న రుణ, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుదారులకు గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 3 నెలల మారటోరియం సదుపాయం కల్పించిన విషయం విదితమే. మే 31వ తేదీ వరకు మారటోరియం అమలులో ఉంటుందని ఆర్బీఐ గతంలో తెలిపింది. అయితే ఆ మారటోరియాన్ని బ్యాంకులు సరిగ్గా అమలు చేస్తున్నాయో, లేదో పర్యవేక్షించాలని ఆర్బీఐకి సుప్రీం కోర్టు సూచించింది.
దేశంలో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐ చెప్పినట్లే తమ కస్టమర్లకు మారటోరియం సౌకర్యాన్ని కల్పించాయి. చాలా మంది కస్టమర్లు దీన్ని వాడుకున్నారు కూడా. అయినప్పటికీ పలు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు కస్టమర్లకు మారటోరియం అందివ్వడం లేదని ఆరోపిస్తూ గతంలో కొంతమంది పిటిషనర్లు సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దీంతో ఆ పిటిషన్లను విచారించిన ముగ్గురు సభ్యులున్న సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఆర్బీఐకి మారటోరియంపై సూచనలు చేసింది.
జస్టిస్‌లు ఎన్వీ రమణ, సంజ్ కిషన్ కౌల్, బీఆర్ గావైలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆర్బీఐకి మారటోరియంపై సూచనలు చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మారటోరియాన్ని సరిగ్గా అమలు చేస్తున్నాయో, లేదో పర్యవేక్షించాలని న్యాయమూర్తులు సూచించారు. మారటోరియం సజావుగా అమలయ్యేలా చూడాలని ఆర్బీఐని సుప్రీం కోర్టు ఓ లేఖలో కోరింది.