తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గినట్టు అనిపిస్తున్నప్పటికీ.. అక్కడక్కడ మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. వైరస్ సోకిన తర్వాత లక్షణాలు వెంటనే బయటపడే అవకాశం లేకపోవడంతో.. కరోనా బాధితులను గుర్తించడం కష్టంగా మారుతోంది. అలాగే కొన్ని ఘటనల్లో బాధితులకు వైరస్ ఎలా సోకిందనేది కూడా తెలియడం లేదు.
తాజాగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఒకే కుటుంబంలో తల్లి, కూతరుకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. అది కూడా కూతురికి కరోనా నిర్ధారణ అయినా.. దాదాపు 15 రోజులకు తల్లికి కూడా కరోనా సోకినట్టు తేలింది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు ధ్రువీకరించారు. కాగా, గత నెల 21వ తేదీన హన్మకొండలోని ఓ పదేళ్ల బాలికకు కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. అదే సమయంలో ఆ బాలిక తల్లిదండ్రలుకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. వీరు మర్కజ్ యాత్రికులతో కలిసి ట్రైన్‌లో ప్రయాణించారు.
దీంతో ఆ బాలికను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సమయంలో బాలికతో పాటు ఆమె తల్లి కూడా గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో బాలిక తల్లికి కూడా కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.