ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందిని ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ మన శరీరంలో అనేక భాగాలకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ క్యాన్సర్ అయినా సరే.. ఆరంభంలో దాన్ని గుర్తిస్తేనే చికిత్స చేయడం సులభతరమవుతుంది. ముదిరితే ప్రాణాంతకమవుతుంది. ఈ క్రమంలోనే క్యాన్సర్ వచ్చిందని తెలియజేసేందుకు మన శరీరం ముందుగానే మనకు కొన్ని సూచనలు, లక్షణాలను చూపిస్తుంటుంది. వాటిని ముందే తెలుసుకోవడం ద్వారా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మరి ఆ సూచనలు, లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
* నిత్యం పలు రకాల పనులు చేసే మనం అలసిపోతుంటాం. దీంతో ఆయా భాగాల్లో నొప్పులు కూడా వస్తుంటాయి. అవి తెల్లారితే పోతాయి. అయితే అలా కాకుండా కొన్ని రకాల నొప్పులు మాత్రం కొన్ని భాగాల్లో ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అంటే.. ఉదాహరణకు ఛాతిలో ఎప్పుడూ నొప్పి వస్తుందనుకుంటే.. అది గ్యాస్ లేదా గుండెనొప్పి లేదా.. ఒక్కోసారి లంగ్ క్యాన్సర్ కూడా అయి ఉండవచ్చు. ఇక కడుపునొప్పి తరచూ వస్తుంటే అది.. స్త్రీలలో అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్ కావచ్చు. కనుక ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులు ఉన్నవారు వెంటనే వైద్యున్ని సంప్రదించి క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ ఉందని తేలితే తక్షణమే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయరాదు.
* తరచూ దగ్గు వస్తుంటే అది లంగ్, త్రోట్ లేదా లారింక్స్ క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
* డయాబెటిస్ లేకున్నా కొందరికి తరచూ మూత్రం వస్తుంటుంది. రోజులో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు. అలాంటి వారికి మూత్రాశయ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణం ఎవరిలోనైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి.
* పెద్ద పేగు (కోలన్) క్యాన్సర్ ఉన్నవారికి విరేచనం ఇబ్బందిగా జరుగుతుంటుంది. లేదంటే టైం కాని టైంలో విరేచనం వస్తుంది. మలబద్దకం సమస్య లేకున్నా ఇలా జరుగుతుందంటే దాన్ని కొలన్ క్యాన్సర్‌గా అనుమానించాలి. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
* బ్లడ్ క్యాన్సర్ ఉంటే విపరీతమైన అలసట వస్తుంది. ఆయాసంగా ఉంటుంది. ఏ పని చేయకున్నా తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఈ లక్షణం ఉన్నా దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాల్సిందే.
* నోరు లేదా ఇతర శరీర భాగాల్లోంచి తరచూ రక్తస్రావం అవుతుంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి. అలాగే గర్భాశయ క్యాన్సర్ ఉండే మహిళల్లో యోనిలో తరచూ రక్తస్రావం అవుతుంటుంది. అదే విరేచనంలో రక్తం ఉంటే దాన్ని కోలన్ లేదా రెక్టాల్ క్యాన్సర్‌గా అనుమానించాలి. ప్లీహంలో రక్తం కనిపిస్తే దాన్ని లంగ్ క్యాన్సర్‌గా భావించాలి.
* సాధారణంగా అధిక శాతం మందికి శరీరంలో ఆయా భాగాల్లో చర్మం కింద గడ్డలుగా ఏర్పడుతుంటాయి. వీటిని కొవ్వు గడ్డలని అంటారు. అయినప్పటికీ అవి క్యాన్సర్ గడ్డలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కనుక డాక్టర్‌ను సంప్రదించి అవి కొవ్వు గడ్డలా, క్యాన్సర్ గడ్డలా అని నిర్దారించుకునేందుకు పరీక్షలు చేయించుకోవాలి.
* చర్మ క్యాన్సర్ ఉన్నవారిలో చర్మంపై మచ్చలు ఉన్న పళంగా సైజు పెరుగుతాయి. అలాగే ఆ మచ్చల కలర్లో మార్పు వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని క్యాన్సర్‌గా అనుమానించాలి.
* డయాబెటిస్ ఉన్నవారికి గాయాలు అయినా, దెబ్బలు తాకినా అంత త్వరగా మానవు. అయితే డయాబెటిస్ లేకున్నా గాయాలు మానడం లేదు అంటే.. అది క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఈ లక్షణం ఎవరిలో అయినా ఉంటే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
* థైరాయిడ్, టైప్ 1 డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఉన్న పళంగా బరువు తగ్గుతారు. అయితే ఆ సమస్యలు లేకున్నా బరువు సడెన్‌గా తగ్గుతున్నారంటే.. అది కోలన్ క్యాన్సర్ అయి ఉండవచ్చు. ఈ లక్షణాన్ని ఎవరైనా కలిగి ఉంటే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.
* థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని సందర్భాల్లో ద్రవ లేదా ఘన ఆహారాన్ని మింగలేకపోతుంటారు. అయితే థైరాయిడ్ లేని వారికి కూడా ఈ సమస్య ఎదురవుతుందంటే.. అది గొంతు క్యాన్సర్ అయి ఉండవచ్చు. కనుక అలాంటి వారు డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని.. ఆ మేర అవసరం అనుకుంటే మందులు వాడాలి. క్యాన్సర్ ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి.