మేత సద్వినియోగంలో గడ్డికోత యంత్రాలు..ఇలా వాడితే వృథానే ఉండదు..!

వ్యవసాయం చేసిన తర్వాత రైతులు ప్రాధాన్యం ఇచ్చేది పుశువుల పెంపకానికే. ఒకరకంగా వ్యవసాయంలో నష్టాలు వస్తాయి కాని..పశువుల పోషణలో అసలు నష్టమే ఉండదు. కాకపోతే.. కనిపించని కష్టం చాలా ఉంటుంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో పశుగ్రాసం సమస్య ఎక్కువగా ఉంటుంది. పశువులకు పాలదిగుబడి పెరగాలంటే.. పచ్చిమేత కావాలి. అయితే.. పశువులు మాత్రం గడ్డిని పూర్తిగా తినవు. సగం సగం తిని పాడుచేస్తాయి. అశలే గడ్డికొరత అంటే.. మరి ఇలా పశుగ్రాసాన్ని పూర్తిగా తినకపోతే.. రైతులకు నష్టమే కదా.. గడ్డికి కొరతలేని ప్రాంతాల్లో అయితే పెద్ద సమస్య ఉండదు. కానీ పచ్చిగడ్డి దొరకడమే కష్టం అన్న ప్రాంతాల్లో ఎలా.. అందుకు ఉందిగా గడ్డికోత యంత్రం.
గడ్డికోత యంత్రాలను పశుసంవర్ధకశాఖ రాయితీపై అందిస్తోంది.
పశుగ్రాసాన్ని కత్తిరించి మేపితే ఎలాంటి లాభాలు వస్తాయి..?
మేత వృథా కాకుండా పశువులు పూర్తిగా తింటాయి. పాలల్లో దిగుబడి, వెన్నశాతం పెరుగుతుంది.
గడ్డికోత యంత్రంతో చిన్నచిన్న ముక్కలుగా కాండాల్ని కత్తిరించి మేతగా వేస్తే 90 శాతం మేత సద్వినియోగం అవుతుంది.
పశువులు 10-15 శాతం ఎక్కువ గ్రాసాన్ని తింటాయి. 5-10 శాతం పాల దిగుబడి పెరు గుతుంది. పాల ఉత్పత్తి కోసం చేసే వ్యయం తగ్గుతుంది.
పశుగ్రాసాల కాండం పెద్దగా, లావుగా, ఆకులు వెడల్పుగా, పొడవుగా ఉంటే పూర్తిగా తినలేవు. లేత ఆకులు, కాండాలను మాత్రమే తిని మిగతా భాగాన్ని విడిచి పెడతాయి. తర్వాత ఆ కాండాలను తొక్కి మల మూత్రాలతో పాడుచేస్తాయి.
జొన్నచొప్పను, వరిగడ్డిని కావాల్సిన సైజుకు కత్తిరించి మేతగా వేయడం సాధ్యమవుతుంది. అరంగుళం పైగా సైజులో కత్తిరించి ఎండు గడ్డిని పశువులకు మేతగా వేయడం వల్ల కేవలం పచ్చిమేత కాకుండా ఎండుగడ్డిని కూడా తీసుకుంటుంది. దీనివల్ల పశువుకు పీచుపదార్థాలు బాగా అందుతాయి.
అనేక రకాల పశుగ్రాసాలను కలిపి వృథా కాకుండా ఒకేసారి మేతగా అందించినప్పుడు వాటికి ఇష్టమైన పశుగ్రాసాన్ని తిని మిగతా గ్రాసాలను వదిలివేస్తాయి. దీనివల్ల కొంతమేరకు శరీరానికి కావాల్సిన పదార్థాలు అందకపోవచ్చు. అందువల్ల అన్నిరకాల పశు గ్రాసాల్ని ముక్కలుగా కత్తిరించి పశువుకు ఇవ్వడం వల్ల మొత్తంగా పశుగ్రాసాన్ని తింటాయి.
పశుగ్రాసాన్ని కోసిన తర్వాత డెయిరీ ఫారంలో, పశువులుండే కొట్టాల్లో నిల్వ చేసుకోవాలంటే ఎక్కువ స్థలం కావాలి. అదే కత్తిరించిన గ్రాసాన్ని బస్తాల్లో గాని లేదా గంపల్లో గాని నింపి సులభంగా తక్కువ స్థలంలో నిల్వ చేయవచ్చు. రవాణా చేయడం కూడ సులభమే.
ముక్కలు చేసిన జొన్నచొప్ప పశుగ్రాసాన్ని యూరియాతో ఊరబెట్టి మాగుడుగడ్డిగా, పచ్చిమేత అయితే సైలేజి రూపంలో పశు గ్రాసం నిల్వ చేయవచ్చు. దీనివల్ల పశుగ్రాసం అందుబాటులో లేని సమయంలో మాగుడుగడ్డిని, సైలేజిని పశువులకు అందించవచ్చు.
పశుగ్రాసాలను కత్తిరించే చాప కట్టర్లను జిల్లా పశుసంవర్ధకశాఖ రాయితీపై అందిస్తుంది. ప్రభుత్వం రాయితీపై రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్ కేవీవై) పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. మీ దగ్గరలోని పశు వైద్యాధి కారిని సంప్రదించి కొనుగోలు చేసుకోవచ్చు.
-Triveni Buskarowthu