అల్పపీడనం వల్ల దేశ వ్యాప్తంగా కుండ పోత వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..పలు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా మారింది.చేతికి వచ్చిన వేల ఎకరాల పంట నీట మునిగింది..కొన్ని పంటలు నీళ్ళు వెళ్ళాక మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి.కానీ,కొన్ని పంటలు మాత్రం పాడైపోతాయి.అందులో పండ్ల తోటలు ఎక్కువగా ఉంటాయి.2020 – 21 సంవత్సరంలో పండ్ల తోటలు 6,914 హెక్టార్లలో సాగు చేయబడగా, 1,03,027 మిలియన్ టన్నుల ఉత్పత్తి మరియు ఒక హెక్టారుకు 14.90 మెట్రిక్ టన్నుల ఉత్పాదకత సాధించడం జరిగింది.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ వారి లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2020 – 21 సంవత్సరంలో 4,24,287 ఎకరాలలో పండ్ల తోటలు సాగుచేయబడగా, పండ్ల ఉత్పత్తి 23,89,184.54 మెట్రిక్ టన్నులు సాధించడం జరిగింది. అయితే పండ్ల దిగుబడి తగ్గడానికి తోటలలో ఆశించే రకరకాల కీటకాలు, పురుగులు మరియు వివిధ రకాల తెగుళ్ళతో పాటు భారీ వర్షాలు మరియు అకాల వర్షాలు కూడా కారణమవుతున్నాయి. భారీ వర్షాలు వివిధ రకాల తోటలలో మొక్క యొక్క వివిధ దశలలో నష్టం కలుగజేసే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే కొంత మేర నష్టాన్ని తగ్గించవచ్చు..
ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…
జామ :
అధిక నీటిని తీసివేసి గొర్రుతో దున్నకం చేపట్టి, తేలికగా చెట్టు చుట్టూ త్రవ్వి, పాదులు తయారు చేసుకోవాలి.
చెట్టు మొదళ్ళ దగ్గర కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లీ. చొప్పున ద్రావణాన్ని పోయాలి.
కాయకోత అనంతరం వచ్చే ఆంత్రాక్నోస్ తెగులు నివారణకు కార్బండిజమ్ 1 గ్రా. లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పొటాషియం నైట్రేట్ 10 గ్రా. /లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి..
జామలో వడలు తెగులు నివారణకు ట్రైకోడెర్మావిరిడి మిశ్రమాన్ని వేయాలి.
చౌడు ఉన్నట్లయితే 1 కేజీ జిప్సం ఒక చెట్టుకు వెయ్యాలి.
కార్బండిజమ్ 1 గ్రా./ లీ. నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పిచికారీ చేయాలి.
దానిమ్మ :
తోటలలో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి.
మొదళ్ళ వద్ద నీటిని తిరగవేయాలి.
చెట్టు మొదళ్ళను కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రా. / లేదా నీటికి కలిపిన ద్రావణంతో తడిపి వేర్లు తెగుళ్ళకు గురికాకుండా చూడాలి.
బాక్టీరియా తెగుళ్ళు నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రా. / 10 లీటర్ల నీటికి మరియు స్ట్రెప్టోసైక్లిన్ 1 గ్రా. / 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.ఎండిపోయిన మరియు తెగుళ్ళు సోకిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయడం ద్వారా బాక్టీరియా తెగుళ్ళను నివారించ వచ్చును..
బొప్పాయి :
మొక్క మొదళ్ళ దగ్గర ఉన్న నీటిని తీసివేయాలి.
మెటలాక్జిల్ ఎంజెడ్ 3 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. / లీటరు నీటికి కలిపి మొదళ్ళ దగ్గర పోయాలి.
సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 5 గ్రా. / లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కోతకు తయారై ఉన్న కాయలను మార్కెట్ కు తరలించాలి.పండు కుళ్ళు నివారణకు హెక్సాకోనజోల్ 2 మి.లీ. లేదా డైఫెన్ కొనజోల్ 0.5 మి.లీ.0 0.5 మి.లీ. (స్టికర్) జిగురు మందును కలిపి పిచికారీ చేయాలి..ప్రతి పంటలో ముందుగా నీటిని బయటకు పంపించాలి..మరింత సమాచారం కొరకు దగ్గరిలొని వ్యవసాయ నిపుణులను సంప్రదించగలరు..