బ్యూటీ స్పీక్స్ : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

-

అనంతం అయిన ప్రేమ
అనంతం అయిన ప్ర‌ణ‌యం
ప్ర‌ణ‌య ధార..కొన్ని మాత్ర‌మే
అర్థాల‌కు తూగుతాయి
కొన్ని చీక‌ట్ల చెంత మాత్ర‌మే
దేహ కాంతులు
కొత్త అర్థాలు వెతుకుతాయి
దేహం కోరుకున్న అధరం అందుకున్న సంద‌ర్భాలే
మ‌ధుర సంబంధితాలు..మ‌ధురామృతాలు
మగువని మీటి..ప‌లికిన మోవిని ప్రేమొక్క‌టే
అజ‌రామ‌రం చేస్తుందా ?
ఇరు దేహ తీరాల‌నూ ముద్దొక్క‌టే
క‌లిపి ఉంచి ఒక్క‌టి చేసి
హాయి లోకాల‌లో ఒల‌లాడించి
సంతృప్తం చేస్తుందా?

ఒక నువ్వు ఒక నేను క‌లిస్తే ప్రేమ అని రాశారొక‌రు. అబ‌ద్ధ‌మో నిజ‌మో కానీ వాంఛాతీతం అయిన ప్రేమ‌లు లేవు క‌నుక ఆ లోగిలి చెంత ముద్దును ప్ర‌ణ‌య వాంఛ‌గానే ప‌రిగ‌ణించాలి. ప్రేమ సంబంధ భాష‌కు అర్థం చెప్పాలంటే, లిపిని ఇవ్వాలంటే ముద్దుకు మించిన మ‌రో ప్ర‌త్యామ్నాయం ఉంటుందా? క‌నుక ప్రేమ సంబంధ సంకేతాల చెంత, మౌన సంబంధ సందర్భాల చెంత, స‌హేతుకత‌కు తూగే ఏకాంత స్థావ‌రాల చెంత దేహాలకు ముద్దు వారధి. అంతే లేని అవ‌ధి కూడా ! త‌డి క‌న్నుల చెంత ముద్దు ఓ ఉప‌శ‌మ‌న‌మే కాదు..సామ‌ర‌స్య పూర్వ‌క ప‌రిష్కారం కూడా! వాట్ నాట్ వాట్ ఎల్స్..అన్నీ కిస్కింద కాండే నేర్పిపోవును.

పెద‌వి ఒలికించిన క‌విత్వం ఒక ముద్దు పెద‌వి ప‌లికించిన ఓ క‌విత్వం చెంత వెలుగు రేఖ ఒక పొద్దు.. చీక‌టి చెంత ఆగిన వెలుగు రేఖ‌లు కొన్ని విచ్చుకుంటూ దేహాల త‌న్మ‌యాల‌ను క‌లిపితే ముద్దు ఓ క‌విత్వ సంబంధం.. ప్రేమ సంబంధం. ప్రేమాన్విత ఛాయ‌ల్లో  రెండు దేహాల కూడిక‌కు ప్ర‌కృతి కాంక్ష‌ల‌కు ప్ర‌ణ‌య ధార‌ల‌ను ఒలికించే ముద్దు.. హ‌ద్దులు లేకుండా ఉంటేనే హాయి. ఓం న‌మః న‌య‌న జ‌తుల‌కు అని రాశారు క‌వి వేటూరి..ఓం నమః హృద‌య ల‌య‌ల‌కు..అని చెప్పిన క‌వి వేటూరి..ల‌యాన్విత ధోర‌ణుల‌ను క‌లిపి ముగ్ధ‌ను చేరువ చేసిన వేళ చీక‌టి ఇచ్చిన తొలి కానుక ముద్దు..మేలు చేసే చీక‌టి జ్ఞాప‌కాల‌ను ఇస్తుంది. మేలు చేసే వెలుగు జ్ఞాప‌కాల‌కు తోడు ఉంటుంది.

పెదవి భావ‌న‌ల‌ను క‌వితాత్మ‌కం చేయ‌డం ముద్దు తోనే సాధ్యం. ప్రేమ లోకాలను విహ‌రింప‌జేయ‌డం ముద్దుతోనే సాధ్యం.. పెద‌వి వాయ‌నం అందించ‌డం.. ప్రేమామృత త‌త్వ సారాన్ని అందించ‌డం కూడా అధ‌రం తోనే సాధ్యం. క‌నుక క‌వి వాక్కు అనుసారం అధ‌రం మ‌ధురం.. న‌య‌నం మధురం అని.. అవును! చూపులు కూడా ముద్దు పెట్టుకునే సంద‌ర్భాలుంటాయి. పెద‌వుల తార్లాట కూడా ఉంటాయి.. ముద్దాడుకునే చూపులు వెన్నెల కెర‌టాల‌ను దాచుకుంటాయి అని రాశానొక చోట.. అది తొలి ప్రేమ.. శ్వాస రీతిని అస్థిరం చేసేది కూడా ముద్దే ! కౌగిట వాకిట మ‌రో జ‌న్మ‌ను అందుకునేందుకు ఆరంభం కూడా ముద్దే..క‌నుక తొలి రేయి హాయి వాకిట హ‌ద్దులు చెరిపిన ముద్దు మౌనాల‌కు కొన‌సాగింపు ఇస్తుంది. క‌న్నీళ్ల‌ను తుడిచేస్తుంది. నీరు పొంగిన క‌నులా ఇవి ..
అని ప్ర‌శ్నిస్తూ ముద్దుల‌తో క‌న్నీళ్ల‌ను నిలువ‌రిస్తుంది. ప్రేమాన్విత ఛాయ‌ల చెంత కురిసి మురిసిన ముద్దుల వానలు అపురూపానికి ఆన‌వాళ్లు. న‌గ్న పాదాల‌కు న‌గ్న దేహాల‌కు చేరుకున్న ముద్దులు అన్నీ శృంగార సంబంధాలే కావు ఆత్మీయానురాగాల‌కు ఆన‌వాళ్లు కూడా!

మంచి భావ‌న‌లకు సంకేత స్థావ‌రం అయిన పెద‌విని మ‌రో పెద‌వి అంటించుకుని వెళ్లిపోయింది. ఫ‌లితంగా అధ‌ర  చుంబ‌నం పుట్టింది. అంటే ముద్దు అని అర్థం. అధ‌రం అమృతం అని రాశారు ఒక‌రు న‌వ్వుకున్నారు. అమృతం అయినా విషం అయినా బాహువుల సందిట్లో చిక్కుకున్నాక, కౌగిట పొందిన సుఖ‌మో దుఃఖ‌మో ఫ‌లితంగా అందేది ముద్దే! చేదు ముద్దు ఎక్క‌డ‌యినా ఉందా చెప్పండి. ఉన్న‌వ‌న్నీ హాయికి సంకేతాలు. తీపి ఎడ‌బాటును త‌గ్గించే సూత్రాలు.. అనున‌య  సూత్రాలు ముద్దులే!
ఒక క‌వి ముద్దుతో ఓన‌మాలు నేర్పించ‌నా అని అన్నాడు. ఆ మాట విని మ‌ళ్లీ న‌వ్వుకున్నాను. పెద‌వి ఆత్రంను ఈ విధంగా అర్థం చేసుకోవాలా అని! అయినా ప్రేమ‌కూ సంబంధిత ఆన‌వాళ్ల‌కూ కొన‌సాగింపు మౌన ముద్ర కూడా ముద్దే అవుతుంది. అసలు ముద్దుల‌కు హ‌ద్దే లేవు.కానీ కొంద‌రు ముద్దును ఆత్మీయానురాగానికి ప్ర‌తీక‌గా చూడ‌క శృంగార సంబంధ చ‌ర్య‌కు తొలి మెట్టుగానే భావిస్తారు. అది త‌ప్పు ! అమ్మానాన్న‌ల ప్రేమ ముద్దుల త‌డి నుంచే ఆరంభం అవుతుంది క‌దా! క‌నుక ఆ విధంగా అమ్మానాన్న‌ల ప్రేమ నుంచి, అన్నా చెల్లెళ్ల ప్రేమ నుంచి, అక్కా త‌మ్ముళ్లు ప్రేమ నుంచి ప్రేయ‌సీ ప్రేమికుల వ‌ర‌కూ ముద్దు అన్న‌ది బాహ్య సంబంధం కానే కాదు. అదొక ఆత్మీయత‌కు సంకేతం.

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి….

– బ్యూటీ స్పీక్స్ – మ‌న లోకం ప్ర‌త్యేకం 

ఆర్ట్ : బాబు దుండ్ర‌పెల్లి 

Read more RELATED
Recommended to you

Latest news