కళ్ళకింద నల్లటి వలయాలు పోగొట్టుకునే ఇంటి చిట్కాలు..

-

ముఖంపై మొటిమలు ఎంత ఇబ్బంది పెడతాయో కళ్ల కింద నల్లటి వలయాలు అంతకన్నా ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ వలయాలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి. నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి మొదలగు కారణాల వల్ల కళ్ళకింద వలయాలు ఏర్పడతాయి. కళ్లకింద అంత త్వరగా ఏర్పడడానికి కారణం కూడా ఉంది. కళ్ల కింద ఉండే చర్మం చాలా మృదువుగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి చాలా తొందరగా గురవుతుంది. అందుకే కళ్ళకింద వలయాలు ఏర్పడతాయి.

వీటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో చాలా సాధనాలున్నాయి. ఐతే ఈ వలయాలని పోగొట్టుకోవడానికి ఇంట్లోనే ఔషధం తయారు చేసుకోవచ్చు.

కళ్ళ కింద వలయాలు పోగొట్టుకోవడానికి ఇంటి చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ వాటర్..

రోజ్ వాటర్ చర్మానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కళ్లకింద వలయాలని పోగొట్టడంలో రోజ్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. ఒక చిన్న కాటన్ ముక్క తీసుకుని రోజ్ వాటర్ లో ముంచి, కళ్ళకింద వలయాల భాగంలో మర్దన చేసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేస్తే సరిపోతుంది.

దోసకాయ..

దోసకాయ ముక్కల్ని గుండ్రంగా కత్తిరించుకుని వాటిని కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి, ఆ తర్వాత కళ్లపై ఉంచుకోవాలి. అలా కాకున్నా దోసకాయ ముక్కలని చిదిమేసి, ఆ రసాన్ని వలయాల మీద మర్దన చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత పూర్తిగా శుభ్రంగా కడిగేసుకోవాలి.

బంగాళ దుంప..

బంగాళ దుంపలని కొద్ది సేపు రిఫ్రిజిరేటర్లో ఉంచుకుని తర్వాత వాటిని ముక్కలుగా కత్తిరించుకుని, దాన్ని రసంగా చేసి, ఆ రసాన్ని కళ్లకింద వలయాల చుట్టూ మర్దన చేయాలి. 15నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా ఓ వారం రోజుల పాటు చేస్తే సరైన ఫలితం దక్కుతుంది.

ఇవేగాక సరైన నిద్ర కళ్లకింద వలయాలని రాకుండా కాపాడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news