స్టార్‌బక్స్ ఈ పేరు తెలియని యువతీయువకులు ఉండరు. కాలేజ్ టైం అయిపోగానే స్నేహితులతో.. ఆఫీసు సమయంలో మధ్యలో కాస్త రీఫ్రెష్ అవుదామని కొలీగ్స్ తో వెళ్లాలనుకుంటే ది బెస్ట్ ప్లేస్ ఇది. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే.. ఈ స్టార్‌బక్స్‌కు సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. కేవలం కంపెనీకి సీఈఓగానే కాకుండా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగానూ ఉంటారని స్టార్‌బక్స్ గురువారం ప్రకటించింది. అక్టోబరు 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది.
55 ఏళ్ల నరసింహన్ బ్రిటన్‌కు చెందిన రెకిట్ బెంకిజర్ అనే బహుళజాతి కంపెనీకి సీఈఓగా పనిచేశారు. సెప్టెంబరు 30న రెకిట్ బెంకిజర్ కంపెనీ సీఈఓ బాధ్యతల నుంచి లక్ష్మణ్ నరసింహన్ వైదొలిగినట్లు సంస్థ తెలిపింది. ‘అమెరికాకు తిరిగి రావడానికి నాకు అవకాశం లభించింది. లండన్‌ను విడిచిపెట్టి రావడం కష్టతరమైనప్పటికీ.. కుటుంబం కోసం కఠిన నిర్ణయం తీసుకుంటున్నా’ అని లక్ష్మణ్ నరసింహన్ తెలిపారు. లక్ష్మణ్ నరసింహన్ సీఈఓగా నియమితులవ్వడం వల్ల భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ఉన్నత శిఖరాన్ని అధిరోహించనట్లైంది.