స్పైస్​జెట్​లో వాటా విక్రయం.. దూసుకెళ్లిన షేరు

-

చౌకధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ నిధుల కొరత సమస్య నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. నిధులు సమీకరించే నిమిత్తం సంస్థ ప్రమోటరు అజయ్‌ సింగ్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకోసమని ఓ మధ్యప్రాచ్య విమానయాన సంస్థతో పాటు మన దేశానికి చెందిన దిగ్గజ కార్పొరేట్‌ సంస్థతోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

విమానయాన సేవలను నిరాటంకంగా కొనసాగించాలంటే.. స్పైస్‌జెట్‌ సత్వరం మూలధన పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ‘నిధుల సమీకరణ కోసం పెట్టుబడిదార్లతో కంపెనీ చర్చలు జరుపుతోంది. ఇవి ఫలవంతమైతే ఆ వివరాలను నియంత్రణ సంస్థలకు తెలియజేస్తామ’ని స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో అజయ్‌ సింగ్‌కు 60 శాతం వాటా ఉంది. ‘ఓ మధ్యప్రాచ్య సంస్థతో అజయ్‌ సింగ్‌ చర్చలు సాగిస్తున్నారు. ఆ సంస్థ 24 శాతం వాటా కొనేందుకు ఆసక్తి చూపుతోంది. కంపెనీ బోర్డులో సభ్యత్వాన్ని అడుగుతోంది. ఓ దిగ్గజ దేశీయ సంస్థతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయ’ని స్పైస్‌జెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

స్పైస్‌జెట్‌ను 2004-05లో అజయ్‌ సింగ్‌ ప్రారంభించారు. తదుపరి కళానిధి మారన్‌ చేతికి వెళ్లినా, మళ్లీ 2015లో అజయ్‌సింగ్‌ ఆధీనంలోకి వచ్చింది.ప్రస్తుతం దేశీయంగా 51 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రాంతీయ విమాన సేవల కింద పాక్యోంగ్‌, ఝార్సుగూడ, కాండ్లా, దర్భాంగా, కాన్పూర్‌, అజ్మీర్‌ (కిషన్‌గఢ్‌) తదితర గమ్యస్థానాలకూ సేవలను అందిస్తోంది.ఇతర సంస్థలతో పోలిస్తే వేతనాలు తక్కువగా ఉన్నాయనే ఆందోళన కంపెనీ ఉద్యోగుల్లో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఉద్యోగులకు ఫామ్‌-16 కూడా ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ వార్తలు వెలుగులోకి వచ్చాయి.

నిధుల సమీకరణ యత్నం వార్తల నేపథ్యంలో, స్పైస్‌జెట్‌ షేరు ఇటీవల దూకుడు కనబరుస్తోంది. గత ఐదు ట్రేడింగ్‌ రోజుల్లో షేరు 39.61% (రూ.14.20) పెరిగింది. బీఎస్‌ఈలో బుధవారం ఒక్క రోజే షేరు 12.73 శాతం (రూ.5.65) దూసుకెళ్లి రూ.50.05 వద్ద స్థిరపడింది.

Read more RELATED
Recommended to you

Latest news