ఆర్ ఆర్ ఆర్.. పుష్ప.. అప్పుడే పోటీ మొదలు.. ఏది గెలుస్తుందో!

తెలుగు సినిమా నుండి రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో పోటీ పడుతున్నాయంటే సంతోషించాల్సిన విషయమే. కాకపోతే రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరోటి హిట్ అవ్వాలనేది సగటు తెలుగు సినిమా అభిమాని కోరిక. ఆర్ ఆర్ ఆర్, పుష్ప.. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవ్వట్లేదు. ఒకే సీజన్లోనూ రిలీజ్ కావట్లేదు. అయినా కానీ ఇంత చర్చ రావడానికి కారణం, ఆర్ ఆర్ ఆర్ దోస్తీ పాట వచ్చిన కొన్ని రోజులకే పుష్ప దాక్కో దాక్కో మేక పాట రావడం.

రెండు పాటలు అభిమానులకి మంచి కిక్కిచ్చాయి. అటు ఆర్ ఆర్ ఆర్ దోస్తీ పాట క్లాస్ టచ్ తో ఎమోషన్స్ ని తారాస్థాయిలోకి తీసుకెళితే, ఇటు పుష్ప పాట, మాస్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఐతే ప్రస్తుతం ఈ రెండు పాటల గురించి అభిమానుల మధ్య పెద్ద చర్చ నడుస్తుంది. ఈ పాటలను బట్టి సినిమా మీద అంచనాలు పెంచేసుకుంటున్నారు. మా సినిమా మీ సినిమాని తినేస్తదని, మీ సినిమా, మా సినిమాను తినేస్తదని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంలో యూట్యూబ్ వ్యూస్ ప్రధానంగా తీసుకుంటున్నారు.

ఈ రెండు సినిమాల విడుదలకి ఇంకా చాలా సమయం ఉంది. అదీగాక రెండు సినిమాలు వేటికవే ప్రత్యేకం. కాబట్టి రెండు సినిమాలు రెండు విభిన్న ప్రపంచాలని పరిచయం చేస్తాయి. అదీగాక రెండు సినిమాల రిలీజ్ తేదీలు కూడా వేరే. అందువల్ల రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని ప్రతీ ఒక్కరూ కోరుకోవడమే మంచిది. చూడాలి మరేం జరుగుతుందో!