ప్రముఖ నటుడు అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, హీరో ఉమాపతిని ఆమె వివాహమాడనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజున ఐశ్వర్య-ఉమాపతిల ఎంగేజ్మెంట్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అర్జున్ హోస్టుగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్న విషయం తెలిసిందే. అలా అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడి.. ఐశ్వర్య, ఉమాపతిల మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త ప్రేమకు దారి తీయడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఉమాపతి పుట్టినరోజు సందర్భంగా నవంబరు 8న పెళ్లి తేదీని ప్రకటిస్తామని తంబి రామయ్య గతంలో ఓసారి చెప్పారు. తమిళం, కన్నడలో హీరోయిన్గా కొన్ని చిత్రాల్లో నటించింది ఐశ్వర్య.