బాలయ్య రేంజే వేరు
ఆయన మరో సారి చరిత్ర తిరగరాశారు
రికార్డుల మీద రికార్డులు సృష్టించి
తనదైన హవాను కొనసాగిస్తూ ఉన్నారు
నిజంగానే ఇది అఖండ విజయం ఆయనకు !
తెలుగు చిత్ర సీమలో కరోనా తరువాత అనేక అననుకూల పరిణామాలు ఏర్పడ్డాయి.సినిమా పరిశ్రమ అయితే ఎన్నో ఒడిదొడుకుల్లో ఉంది.ఇదే సమయంలో అఖండ విడుదలయింది. ఓ వైపు కరోనా భయాలు మరోవైపు జగన్ భయాలు కలిసి బిక్కు బిక్కుమంటూ ఇవాళ నిర్మాతలంతా ఉన్నారు.అయినా కూడా నిర్మాత సాహసించి అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేశారు. డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు.
ప్రీ రిలీజ్ లో అలరించిన బన్నీ
……ఆనందించిన నందమూరి
ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ అన్నీ ముందు నుంచే చాలా బాగా జరిగాయి. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ వేడుకలకు వచ్చి చిత్ర బృందంలో కొత్త ఉత్సాహం నింపారు. అంతేకాదు వేడుకల్లో అందరి కోరికనూ మన్నించి జై బాలయ్య అనే నినాదం చెప్పి నందమూరి అభిమానులను ఉర్రూతలూగించారు. ఇవన్నీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.సినిమాపై పాజిటివ్ బజ్ ను పెంచేశాయి.అదేవిధంగా ఓవర్సీస్ లోనూ మంచి టాక్ తెచ్చుకుని అక్కడ కూడా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికీ అమెరికా,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో ..
అనూహ్య ఫలితాలకు తార్కాణం
బాలయ్యకే సాధ్యం అయిన వైనం
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం విజయవంతంగా యాభై రోజుల మెలు రాయిని దాటేసింది.103 థియేటర్లలో అర్ధ శతదినోత్సవ పండుగను అభిమానుల కేరింతల నడుమ వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు.సినిమా అన్ని ప్రాంతాల కలెక్షన్లూ కలుపుకుని రెండు వందల కోట్ల క్లబ్ ను చేరుకుంది.దీంతో దర్శక,నిర్మాతలు ఎంతో ఆనందంలో ఉన్నారు.త్వరలోనే అఖండ సీక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.ఈ సీక్వెల్ లో అల్లు అర్జున్ ఓ ప్రత్యేక పాత్రలో మెరవబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఓటీటీలోనూ విడుదయింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 21న విడుదలయింది. విడుదలయిన 24 గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి, అరుదైన రికార్డును నమోదు చేసింది. మరోవైపు నాని నటించిన శ్యాం సింగ రాయ్ కూడా ఇదే రోజు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయినప్పటికీ బాలయ్య సినిమాకే భలే క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మేకింగ్ వీడియోను విడుదల చేసి నందమూరి అభిమానులను ఆనందింపజేసింది.