నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రబందానికి ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోని ‘నాటునాటు పాట’కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారందరికి గర్వకారణంగా పేర్కొన్నారు.
‘నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజాజీవన వైవిధ్యానికి అద్దం పట్టాయన్నారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయిత చంద్రబోస్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇతర సాంకేతిక సిబ్బందికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
‘ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి….. దిగంతాలకు వ్యాపించింది. ఈ అవార్డు తెలుగు రాష్ట్రాలకే కాకుండా ద్రావిడ భాషలకు, యావత్తు భారత దేశానికి గర్వకారణం. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలి. వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజాజీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలి’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.