హీరో శ్రీకాంత్.. పరిచయం అవసరంలేని పేరు. ఎన్‌కౌంటర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన శ్రీకాంత్ ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం హీరో కాకపోయినా.. సినిమాల్లో మంచి మంచి పాత్రలు దక్కించుకుంటూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా కష్టకాలంలో నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనా కట్టడి చేయాలంటే బౌతిక దూరమే ముందున్న మార్గంగా కనిపించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోజూ వారి కూలీలు ప్రస్తుతం పనులు పూట గడవని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే వీరిని ఆదుకునేందుకు సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారవెత్తలు ముందడుగు వేసి తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కరోనా క్రైసిస్ చారిటీకు హీరో శ్రీకాంత్ తన వంతుగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఇక మొన్నటికి మొన్న రాయదుర్గం పోలీసులకు శాటిటైజర్లు, ఆహారాన్ని అందించి తన వంతు సాయం చేశాడు.
ఇక తాజాగా మరోసారి శ్రీకాంత్ తన పెద్ద మనసును బయటపెట్టారు. పోలీస్ బందోబస్త్ మధ్య హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర ఐదు వందల మందికి బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశాడు శ్రీకాంత్. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని.. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశామని స్పష్టం చేశాడు. ఏదేమైనా కరోనా కష్టకాలంలో శ్రీకాంత్ తనవంతు సాయం చేసి మానవత్వాన్ని చాటాడు.