కళా తపస్వి విశ్వనాథ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన గొప్ప సినీ గేయ రచయితలు వీళ్లే..

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత..సినీ పరిశ్రమ దిగ్గజం కె.విశ్వనాథ్ తీసిన సినిమాలు ఎంత గొప్పవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘కళా తపస్వి’గా పేరు గాంచిన విశ్వనాథ్ తీసిన ప్రతీ పిక్చర్ కళా ఖండం అని చెప్పొచ్చు. ‘శంకరాభరణం’ వంటి ఆల్ టైమ్ క్లాసికల్ ఫిల్మ్ తీసి తెలుగు వారి ఖ్యాతిని పెంచిన దర్శకుడు విశ్వనాథ్.

విశ్వనాథ్ తన సినీ ప్రయాణంలో ఇద్దరు గొప్ప సినీ గేయ రచయితలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరి చయం చేశారు. వారు ఎవరో కాదండోయ్.. ఒకరు వేటూరి సుందరరామ్మూర్తి కాగా మరొకరు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇద్దరూ సినీ పరిశ్రమ ఉన్నంత కాలం నిలబడిపోయే గొప్ప పాటలను రాశారు. వేటూరి, సిరివెన్నెల రాసిన ప్రతీ పాట ఆడియన్స్ అందరికీ బాగా ఇష్టం.

సీతారామశాస్త్రి ఇంటి పేరు ‘సిరివెన్నెల’ కాదు కానీ ఆ చిత్రానికి ఆయన రాసిన పాటల నేపథ్యంలో అలా సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకన్నారు దివంగత సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి. పద్మశ్రీ పురస్కారం అందుకున్న సిరివెన్నెల విశ్వనాథ్ నుంచి మొదలుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు చాలా మంది దర్శకులకు చక్కటి సినీ పాటలు రాశారు.

ఇక వేటూరి సుందర రామ్మూర్తి విద్వత్తు గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. సందర్భానికి తగ్గట్లు అత్యద్భుతంగా లిరిక్స్ అందించారు వేటూరి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలందరికి దాదాపుగా పాటలు రాశారు వేటూరి. ముఖ్యంగా వేటూరి-విశ్వనాథ్, సిరివెన్నెల-విశ్వనాథ్ కాంబోలో వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.