షూటింగ్ ప్రారంభిస్తే బాగుంటుంది.. కమల్ హాసన్‌కు లైకా బహిరంగ లేఖ

-

లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఇండియన్ 2 (భారతీయుడు 2). శంకర్ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ సెట్‌లో ఘోర ప్రమాదం జరగడం, ముగ్గురు దుర్మరణం చెందడం, పలువురికి గాయాలు కావడం అందరికీ తెలిసిందే. ఈ ఘటన అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఘటనపై సినీ పెద్దలందరూ స్పందించారు.

కమల్ హాసన్ తీవ్ర ఉద్వేగానికి లోనయై కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల సాయాన్ని కూడా అందించారు. ఇక తాజాగా దర్శకుడు శంకర్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. ఎమోషనల్ అయ్యాడు. ఆ ఘటన నుంచి ఇంకా కోలుకోవడం లేదని, నిద్ర లేని రాత్రులను గడుపుతున్నానని, ఆ క్రేన్ ఏదో తన మీద పడితే బాగుండేదని ట్వీట్ చేశాడు. అయితే ఈ ఘటనపై కమల్ హాసన్ లైకా సంస్థపై ఫైర్ అయ్యాడు. ఘటనపై వివరణ, మృతులకు ఆర్థిక సహాయం వంటి వాటిపై చర్యలు తీసుకుంటేనే షూటింగ్‌లో పాల్గొంటానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

తాజాగా లైకా సంస్థ కమల్ హాసన్‌కు ఓ బహిరంగ లేఖను పంపింది. షూటింగ్ సమయంలో జరిగిన క్రేన్ ప్రమాదం దురదృష్టకరమని చెప్పుకొచ్చింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటున్నామని తెలిపింది. ఇప్పటికే వారికి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించామని పేర్కొంది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ఇవన్నీ మీ దృష్టికి రాకపోవడం వల్లే మీరు లేఖ రాశారని భావిస్తున్నామని తెలిపింది. షూటింగ్ సమయంలో అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని, ప్రొడక్షన్ భీమాతో పాటు, వ్యక్తిగత భీమాలు సకాలంలో వచ్చేట్టు చూస్తామని తెలిపారు. మీరు కోరినవన్నీ చేస్తున్నామని, సినిమా షూటింగ్ ప్రారంభిస్తే బాగుంటుంద‌’ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news