మేజర్ సెల్ఫ్ లెస్ ..ఈ మాట ఆయనతో చదువుకున్న లేదా శిక్షణ పొందిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ సభ్యులు (పూణే ) చెబుతారు..మేజర్ కామ్ అండ్ కంపోజ్డ్ అని కూడా వారే అంటారు..మేజర్ మాత్రం తనని తాను ఈ దేశానికి అంకితం ఇచ్చేందుకు సోల్జియర్ అనే పదానికి డెఫినిషన్ వెతికేందుకు అందుకు తానే ఓ ఉదాహరణ అయి నిలిచేందుకు కృషి చేశాడు..దేహం తనది దేశం తనది ప్రాణ తర్పణం అన్నది ఓ మహత్ భాగ్యం..కొన్ని క్షణాల కన్నీటి సుడుల్లో మేజర్ .. ఈ దేశానికి మళ్లీ గుర్తుకువస్తే బాధ్యతగా మెలిగిన ఈ సినిమా రూపకర్తల కృషికి అర్థం దొరికిందని నిర్థారించుకుని తీరాలి.ఆ ఆవలి తీరం చెంత ఈ ఉదయం నేను. మరియు ఎందరో !
మేజర్ జీవితంలో మంచి ప్రేమ కథ ఉంది. మేజర్ సాహసం కన్నా మేజర్ పంచిన ప్రేమ చాలా గొప్పది అని చాటింపు వేసే విధంగా ఉంది. సాహసం అన్నది ప్రేమ కారణంగానే పుట్టుకువస్తుంది. దేశంపై ప్రేమ, కుటుంబంపై ప్రేమ, జీవితం పంచుకున్న అమ్మాయిపై ప్రేమ.. ఇవన్నీ ఈ కథకు మూలాలు. ఇవే ఈ కథకు ఆయుః ప్రమాణాలు కూడా !
అంతా కశ్మీరు నెత్తుటి కథలే రాస్తున్నారు. ఆ హీరో కథ ఎవరు చెప్తారు. కుర్రాడయినా అడవి శేష్ బాగానే కథ రాశాడు. మంచి ఎక్సిక్యూషన్ కూడా ఉంది ఆ కథకు.. స్క్రీన్ ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. ఆ కథ మేజర్ ది. సందీప్ ఉన్నికృష్ణన్ ది. ఈ దేశ రక్షణకు విడిచిన రక్త తర్పణంలో భాగంగా పుట్టిన కథ ఇది. ఈ తరహా కథకు మాటలు కన్నా ఉద్వేగాలు బాగుండాలి. ప్రకాశ్ రాజ్ (మేజర్ తండ్రి కె.ఉన్నికృష్ణన్ పాత్రధారి) జీవించారు. ఆయన తల్లి పాత్రలో రేవతి (ధన లక్ష్మి ఉన్ని కృష్ణన్) కన్నీటిని పంచారు. హృదయం భారం అయి వచ్చే వేళ మీ చావు కన్నా మీ బతుకే ఉన్నతంగా ఉండాలి ఉంటుంది కూడా అన్న ఓ ఉద్వేగ భరితం అయిన మాట వెన్నాడుతూ వస్తుంది. మేజర్ కు వంద చప్పట్లు. పాదాభివందనాలు వారి తల్లిదండ్రులకు.. ఆయన జీవన సహచరి నేహా ఉన్నికృష్ణన్ పాత్రధారి సయీం మంజ్రేకర్ ఎంతో హృద్యంగా నటించారు. వారికి కూడా అభినందనలు. అందం కన్నా కాస్త అభినయం ఉండాల్సిన పాత్ర అది.ఆమె తో పాటు మరో లీడ్ రోల్ లో శోభిత దూళిపాళ కూడా !
26 /11 ముంబయి ఎటాక్స్ గురించి భారతావని మరిచిపోయి పదేళ్లయిపోయింంది. సందీప్ ఉన్నికృష్ణన్ అంటే ఎవరు అని అడిగే దుఃస్థితి వచ్చింది. వీరోచిత పోరు జరిపిన మేజర్ ఇప్పుడు లేరు. ఈ నేలపై లేరు ఈ దేశ చరిత్రలో ఉన్నారు.గాలుల్లో నిక్షిప్తం అయి ఉన్నారు. మేజర్ కు ఉన్న గారాల పట్టి జీవితాన ఉన్నారు. మేజర్ తన భార్యకు పంచిన ప్రేమలో ఉన్నారు. ప్రేమలో కూడా ఉన్నారు. అవును ! దేశాన్ని ప్రేమించే శక్తులకు మేజర్ అవసరం ఎంతో ఉంది. ఈ సినిమాను కూడా బీజేపీ తో సహా అన్ని పార్టీలూ నెత్తిన పెట్టుకోవాలి. ఆయన తెలుగేతర వ్యక్తి కనుక ఈ కథను అలా చూడలేం. చూడబోం. చూడకూడదు కూడా !
డబ్బులు పెట్టినంతనే మంచి సినిమాలు రావు. మంచి అని అనుకునేంతగా చెప్పుకోవాలంటే మేజర్ లాంటి సినిమాలు రావాలి. మహేశ్ బాబు చేసిన సర్కారు వారి పాట కన్నా మహేశ్ బాబు డబ్బులు పెట్టి తీసిన కాదు తీయించిన మేజర్ బాగుంది. అడవిశేష్ బాగున్నాడు. వాస్తవానికి ఈ కథే ఎంతో బాగుంది. ఆత్మ కథలు, బయోపిక్స్ పేరుతో వస్తున్న కథలు ఇవన్నీ ఇప్పటికిప్పుడు సెన్సేషన్ గా నిలవకపోయినా వచ్చిన ఇబ్బందేం లేదు కానీ ఇలాంటి కథలు నిలబడితే సినిమా లోకం ఆనందిస్తుంది. సినిమా అభిమాని ఆనందిస్తాడు అని కదా రాయాలి. మహేశ్ బాబు బాధ్యతగా ఉన్నాడు. అంతే బాధ్యతగా ఈ సినిమాను నిర్మించాడు. డియర్ మేజర్ సాబ్ సాల్యూట్ టు యూ !
– రత్నకిశోర్ శంభుమహంతి