ఏ క్షణాన కరోనా మహమ్మారి వచ్చిందోగానీ.. వరుసగా మానవాళిపై వైరస్‌లు దాడి చేస్తూనే ఉన్నాయి. కరోనా తగ్గిందనుకుంటే… మంకీపాక్స్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు.. కేరళలో నోరోవైరస్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిన్న నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్టు తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారినపడిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో వళింజమ్‌లోని ఎల్‌ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించినట్టు చెప్పారు. పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. నోరావైరస్ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆరోగ్య శాఖ అవసరమైన నివారణ చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కేరళలో తొలిసారి గతేడాది నవంబరులో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరోవైరస్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేసులు నమోదు కాలేదు.