మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సైరా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తిచేసారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అన్ని పనులు పూర్తిచేసి అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అనంతరం చిరు కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమాను సెట్స్ కు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదిని తీసుకుంటే బాగుంటుందని చిరు భావిస్తున్నారుట. ప్రస్తుతం సైరా నరసింహారెడ్డికి అమిత్ సంగీతం, సహా నేపథ్య సంగీతం సమకూర్చుతున్నారు. ఆ వర్కింగ్ స్టైల్ నచ్చే చిరు 152కూడా తనకే ఇస్తే బాగుటుందని కొరటాల ముందు ఉంచారుట. దీంతో కొరటాల ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నాడని సమాచారం.
కొరటాల శివ ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేసాడు. ఆ నాలుగింటికి దేవి ప్రసాద్ సంగీతం అందించాడు. పైగా ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే. ఈ నేపథ్యంలో చిరు సినిమాకు కూడా దేవినే తీసుకోవాలనుకున్నాడుట. కానీ చిరు ప్రపోజల్ కారణంగా ఇప్పుడంతా రివర్స్ అవుతుందని సన్నిహితులు వద్ద అంటున్నాడుట. కొరటాల తో దేవి నాలుగు సినిమాలు చేసిన నేపథ్యంలో దర్శకుడి పల్స్ పట్టుకుని దేవి ఫాలో అయిపోతాడు. అందువల్ల క్రియేటివ్ పరంగా ఇబ్బందులేవి తలెత్తవు. కానీ కొత్త సంగీత దర్శకుడైతే క్రియేటివ్ డిఫరెన్సెస్ తప్పవని సన్నిహితుల వద్ద అంటున్నాడుట. అలాగని చిరంజీవి మాటని కాదనలేని పరిస్థితి.
దీంతో కొరటాల పరిస్థితి ముందు నుయ్యి….వెనుక గొయ్యి అన్న చందంగా ఉందని తెలుస్తోంది. అయితే కొరటాల మదన పడుతోన్న విషయం చిరు దృష్టికి వెళ్తే కచ్చితంగా దర్శకుడి మాటకే కట్టుబడి ఉంటారన్నదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చిరు ఎల్లప్పుడూ దర్శకుల హీరో. దశాబ్ధాలుగా స్టార్ ఇమేజ్ చెక్కు చెదరకుండా ఉందంటే ఆయన యాట్యుట్యూడే కారణం. దర్శక, నిర్మాతలు లేకపోతే హీరోలు ఎలా పుడతారని చాలా బలంగా నమ్మే వ్యక్తి చిరు. నిర్మాత, దర్శకుల తర్వాత హీరో. ఇవన్నీ కొరటాలకు తెలియవని కాదనుకోండి. మరీ ఫేజ్ ని కొరటాల ఎలా దాటుతాడో చూద్దాం.