సైరాని షేక్ చేస్తానంటున్న మిల్కీ బ్యూటీ..

-

తెలుగులోనే కాదు, ద‌క్షిణాదిలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ప్రత్యేక గీతాల‌కు చిరునామాగా నిలుస్తున్నారు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జై ల‌వ‌కుశ‌, జాగ్వ‌ర్‌, కేజీఎఫ్ చిత్రాల్లో ప్ర‌త్యేక గీతాల్లో స్టెప్పులేసి అల‌రించారు. ఆయా సినిమాల ఫ‌లితాలు ప‌క్క‌న పెడితే త‌మ‌న్నా న‌ర్తించిన పాట‌ల‌కు మాత్రం విశేష‌మైన క్రేజ్ వ‌చ్చింది. అవి అదే స్థాయిలో ఆద‌ర‌ణ పొందాయి. త‌మ‌న్నా సాంగ్‌ల కోసం సినిమాలు చూసిన వాళ్ళున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ‌న్నా ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే షేక్ చేయ‌బోతుంద‌ట‌. చిరంజీవి న‌టిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇందులో ఆమె చిరుతో క‌లిసి ఓ స్పెష‌ల్ నంబ‌ర్‌లో ఆడిపాడ‌నుంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ ఎఫ్ సీలో జ‌రుగుతుంది.

అనంత‌రం వికారాబాద్ అడ‌వుల్లో భారీ పోరాట ఘ‌ట్టాల‌ని తెరకెక్కించ‌నున్నారు. దీని త‌ర్వాత అన్న‌పూర్ణ సెవెన్ ఎక‌ర్స్ లో ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో చిరు, త‌మ‌న్నాల‌పై స్పెష‌ల్ నంబ‌ర్‌ని షూట్ చేస్తార‌ట‌. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంద‌ని తెలుస్తుంది. చిరంజీవితో క‌లిసి పాట‌కి  స్టెప్పులేయ‌డం  త‌మ‌న్నాకిదే మొద‌టి సారి కావ‌డం విశేషం. మ‌రి ఈ పాట సినిమాలో ఎలా ఉండ‌బోతుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. త‌మ‌న్నా ప్ర‌త్యేక పాట‌ల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి ఇప్ప‌ట్నుంచే హైప్ పెరుగుతుంది. మొద‌టి త‌రం స్వ‌తంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు.  నయనతార కథానాయికగా, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అనుష్క కూడా ఓ కీలక పాత్రలో యాంకర్‌గా కనిపిస్తారట. సినిమా ప్రారంభమే ఆమె ఎంట్రీతో ఉంటుందని తెలుస్తుంది.

‘సైరా’ కథని అనుష్క చెప్పనుందనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా విడుదల విషయంలో కొంత కాలంగా క‌న్ ఫ్యూజ్ నెల‌కొంది. తొలుత స్వాతంత్ర దినోత్స‌వ కానుక‌గా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తామ‌న్నారు. ఓ ప్రెస్‌మీట్‌లో ద‌స‌రాకి తీసుకొస్తామ‌ని నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ చెప్పారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో దించ‌బోతున్న‌ట్టు మ‌రో వార్త వైర‌ల్ అయ్యింది. ఫైన‌ల్‌గా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని అక్టోబ‌ర్ 2న విడుద‌ల రిలీజ్ చేయాల‌ని డిసైడ్ చేశార‌ట‌. మరి దీనిపై చిత్ర బృందం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news