విల‌న్‌గా ప్ర‌పంచ సుంద‌రి..!

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య‌రాయ్ ని చూస్తే ఎవ‌రికైనా పాజిటివ్ ఫీలింగ్ క‌లుగుతుంది. ఆమె అందాన్ని చూసి ముగ్ధుల‌వ‌డం మ‌న‌వంత‌వుతుంది. ఆమెలో ఏ చిన్న బాధ క‌నిపించినా మ‌న‌లోని అభిమానం ఏమాత్రం త‌ట్టుకోలేదు. అలాంటి ఈ అందాల తార ఐష్‌లో కోపాన్ని చూడ‌గ‌ల‌మా? ఊహించుకోవ‌డానికే క‌ష్టంగా, కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. కానీ త‌ప్ప‌ద‌ట‌. ఆమె భ‌య‌పెట్ట‌డం ఖాయం, ఆమె కోపానికి గురికావ‌డం ఖాయ‌మ‌ని మ‌ణిర‌త్నం టీమ్ అంటోంది. మ‌ణిర‌త్నం ద‌క్షిణాది భాష‌ల్లో భారీ బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ డ్రామాగా పొన్నియిన్ సెల్వ‌మ్ అనే చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. రాజ రాజ చోళ సామ్రాజ్యం నాటి క‌థాంశంతో ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఐశ్వర్యరాయ్‌, విక్రమ్‌, జయంరవి, శింబు, అమలాపాల్‌, మోహన్‌బాబు వంటి భారీ తారాగణం  నటిస్తుంది. తాజాగా ఐశ్వర్య పోషించే పాత్రకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సామాజిక మాద్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఐష్ నెగటివ్‌ రోల్‌లో కనిపిస్తారట. రాణి నందిని పాత్రలో నటిస్తారని చిత్ర వ‌ర్గాలు వెల్ల‌డించాయి.  రాజు పెరియా పజువెట్టరైయర్‌ భార్య నందిని. త‌మ రాజ్యంపై ఆధిప‌త్యం కోసం రాణి నందిని  తహతహలాడుతుంది. అందుకు ఓ కార‌ణ‌ముంద‌ట‌. త‌న‌ను త‌న రాజు, రాజ్యంలోని ప్ర‌ముఖులు అవ‌మాన ప‌రిచిన కార‌ణంగా వారిపై కక్ష క‌ట్టి రాజ రాజ చోళ సామ్రాజ్యాన్ని ప‌త‌నం చేయాల‌ని పూనుకుంటుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆమె వేసే ఎత్తులు ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంటాయ‌ని తెలుస్తుంది. మ‌రి అలాంటి కుట్ర‌లు ప‌న్నే నందిని పాత్ర‌లో ఐశ్వ‌ర్య క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. ఇదిలా ఉంటే ఐష్‌కి నెగ‌టివ్ రోల్ చేయ‌డం కొత్తేమి కాదు.

గతంలో 2004లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ఖాకీ లో నెగటివ్‌ రోల్‌లో నటించి అందరినీ మెప్పించింది.  ఇప్పుడు మ‌ణిర‌త్నం సినిమా కోసం విల‌న్‌గా మార‌బోతుండ‌టం విశేషం. ప్ర‌స్తుతం ప్రీ పొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమాని ఈ  ఏడాది చివర్లో సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు మ‌ణిర‌త్నం బృందం ప్లాన్ చేస్తుంది. ఐష్ చివ‌ర‌గా గతేడాది వచ్చిన ఫన్నే ఖాన్‌ లో నటించింది. అనిల్ క‌పూర్‌, రాజ్ కుమార్ రావు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీసు వ‌ద్ద ప‌రాజ‌యం చెందింది. ఆ త‌ర్వాత  ఆమె మ‌రే సినిమాకి సైన్ చేయ‌లేదు. భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపించినా, ఇప్ప‌టికీ  దానిపై ఎలాంటి స్ప‌ష్ట‌త రాలేదు.