నటసింహ బాలకృష్ణ తమిళ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ తో మరోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బోయపాటిని కాదని రవికుమార్ ఛాన్స్ ఇచ్చి అతనితో సినిమా చేస్తున్నాడు. ఇందులో ఓ క్లారిటీ ఉంది. అయితే ఓ దర్శకుడి విషయంలో మాత్రం బాలయ్య మూడున్నరేళ్ల నుంచి నాన్చుతూనే ఉన్నాడు. అతనే సింగీతం శ్రీనివాసరావు. ఇదిగో పులి..అదుగో తోక అని సోషల్ మీడియాలో ప్రచారం తప్ప! అసలు విషయం ఏంటన్నది ఇప్పటివరకూ బయట పెట్టలేదు. బాలయ్య 100వ సినిమాను సింగీతంతో చేసే అవకాశాలున్నాయని అప్పట్లోనే ప్రచారం సాగింది. కట్ చేస్తే ఆఛాన్స్ క్రిష్ కి వెళ్లింది. అటుపై బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలు పెద్దాయనకు అప్పగిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
తనయుడితో సింగీతం ఆదిత్య 369 లాంటి టెక్నికల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటివరకూ అదీ జరగలేదు. తాజాగా మరోసారి సింగీతం పేరు తెరపైకి వచ్చింది. బాలయ్య ఇటీవలే సింగీతం ను కలిసినట్లు, దాదాపు మూడు గంటలపాటు ఇద్దరి మధ్య మీటింగ్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం మీడియా సహా అభిమానులు అయోమయంలో పడ్డారు. బాలయ్య పెద్దాయన్ని ఎందుకు కలిసినట్లు? తనతో సినిమా చేయడం కోసమా? లేక తనయుడి కోసం కలిసినట్లా? అంటూ ఫిలిం సర్కిల్స్ లో ముచ్చటించుకోవడం మొదలైంది.
ఏ విషయంపైనైనా ముక్కు సూటిగా మాట్లాడే బాలయ్య సింగీతం విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? ఎందుకంతగా తర్జన భర్జన పడుతున్నట్లు? ఈ పంచాయతీలు ? ఏంటి అని ఎనలిస్టులు సైతం విసిగెత్తిపోతున్నారని వినిపిస్తోంది. వీలైనంత త్వరగా ఈ కథనాలపై బాలయ్య ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని..లేదంటే అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగీతం గతంలో బాలయ్యకు ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2013లో వెల్ కమ్ ఒబామా సినిమా చేసారు. కానీ ఆ సినిమా సరైన ఫలితాలు సాధించలేదు. ప్రస్తుతం సింగీతం ఖాళీగానే ఉంటున్నారు.