సాధారణంగా ఏ హీరోయిన్ అయినా వాణిజ్యకథాంశ చిత్రాలతోపాటు మహిళా ప్రధానమైన సినిమాలు చేస్తూ రాణిస్తుంటారు. అలాంటి కథానాయికలకే కెరీర్ పరంగా లాంగ్‌రన్ ఉంటుంది. కానీ దానికి నేను అతీతమంటోంది కాజల్. 2004తో నటిగా ‘క్యూన్ హో గయా నా’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. గుర్తింపు లేని చిన్న పాత్ర పోషించింది. ఆమెను ఎవరూ హీరోయిన్‌గా చూడలేదు. దీంతో హీరోయిన్ గా ఎంట్రీ కోసం మూడేండ్లు వెయిట్ చేసింది. ఈ క్రమంలో దర్శకుడు తేజ రూపంలో తెలుగులో అవకాశం వచ్చింది. కళ్యాణ్ రామ్ సరసన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంలో కథానాయికగా నటించే లక్కీ ఛాన్స్ ఆమెని వరించింది. ఆ సినిమా కమర్షియల్‌గా అంతగా సత్తా చాటలేకపోయినప్పటికీ కాజల్‌కి మాత్రం హీరోయిన్‌గా మంచి గుర్తింపే లభించింది. ‘చందమామ’తో చక్కని అందంతో, మంచి అభినయంతో అందరి మనసులను దోచుకుంది. దీంతో పెద్ద హీరోలు, పెద్ద దర్శక, నిర్మాతల దృష్టిలో పడింది. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో, తెలుగుతోపాటు తమిళం, హిందీలో ఆఫర్స్ దక్కించుకుంటూ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. మూడు భాషల్లో హాట్ కేక్ అయ్యింది. పదేండ్లలో మూడు భాషల్లో కలిపి యాభై సినిమాలకుపైగానే చేసినది. తెలుగులో దాదాపు అందరి యంగ్ స్టార్స్ తో నటించి మెప్పించింది. చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఖైదీ నంబర్ 150’లోనూ నటించి కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ నే ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘సీత’ చిత్రంలో నటించింది. తేజ దర్శకత్వంలో ‘లక్ష్మీ కళ్యాణం’, ‘నేనే రాజు నేనే మంత్రి’ తర్వాత కాజల్ నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో తేజ దర్శకత్వంలో హ్యాట్రిక్ హిట్ అందుకునేందుకు సిద్దమవుతుంది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన కాజల్ ఇందులో మొదటిసారి ఓ బలమైన పాత్ర పోషిస్తుంది.
ఈసందర్భంగా తన సమకాలీకుల లాగా మహిళా ప్రధానమైన చిత్రాల్లో నటించకపోవడంపై కాజల్ ఘాటుగా స్పందించింది. ‘నేను ఎవరినీ పోటీగా భావించను, వారితో నా కెరీర్‌ని పోల్చుకోను. నేను చేస్తున్న సినిమాల విషయంలో చాలా సంతృప్తిగానే ఉన్నాను. వస్తున్న పాత్రల విషయంలోనూ హ్యాపీగా ఉన్నా, నచ్చిన పాత్రలు చేస్తున్నా’ అని తెలిపింది. దీంతో కాజల్ తనకు అచ్చొచ్చిన కమర్షియల్ కంఫర్ట్ జోన్‌లోనే ఉందని చెప్పకనే చెప్పింది. తన రూటే సపరేట్ అని పరోక్షంగా హింట్ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ తెలుగులో సీతతోపాటు శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ చిత్రం, తమిళ్ లో ‘భారతీయుడు 2’, ‘కోమలి’, ‘పారిస్ పారిస్’ చిత్రాల్లో నటిస్తుంది.