ఇంకా హిందీలోనే మాట్లాడుతున్న తారక్.. సౌతిండియాకు వచ్చేశామని రాజమౌళి పంచ్..

-

ఇంకొన్ని గంటల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు చూడబోతున్నారు. కాగా, ఈ సినిమాను కొద్ది రోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్‌గా ప్రమోట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాలకు వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా తెలుగు మీడియా చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే, తారక్ ఇంకా తాను హిందీ చానల్‌కు ఇంటర్వ్యూకు ఇస్తున్నానేమో అనుకుని హిందీలో మాట్లాడబోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

 

చిత్ర విడుదలకు ఒక్కరోజే ఉండగా తెలుగు మీడియా చానళ్లకు వరుసగా రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఇద్దరు హీరోలు కలిసి చేయడం ఎలా ఉంది? అని యాంకర్ ప్రశ్నించారు. దానికి సమాధానమిచ్చే క్రమంలో తారక్ మరిచిపోయి హిందీలో మాట్లాడుతున్నారు. దాంతో రాజమౌళి తారక్‌కు ఆపి, తాము సౌతిండియాకు వచ్చేశామని, హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాడు. దాంతో యాంకర్, రాజమౌళి, చెర్రీ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

‘కొంచెం రెస్ట్ తీసుకో అన్న’ అనే క్యాప్షన్‌తో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సక్సెస్ మీటింగ్స్‌లో నార్త్‌ ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడ మట్లాడొచ్చని సూచిస్తున్నారు. మొత్తంగా తెలుగు హీరోలు కాస్త రాజమౌళి పుణ్యమాని అన్ని భాషలు మాట్లాడేస్తున్నారని ఈ సందర్భంగా సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మెగా, నందమూరి అభిమానులు తమ అభిమాన హీరోల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. టపాసులు పేల్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. థియేటర్ల యాజమాన్యాలు సైతం వెండితెర వద్దకు అభిమానులు, ప్రేక్షకులు వెళ్లకుండా ఉండేందుకు తగు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news