జ్యోతిక మాటల్లో తప్పేముందు సామీ… మళ్లీ వినండి!

-

ఒక్కోసారి మనం ఏదైనా ఒక విషయాన్ని మంచి అభిప్రాయంతో చెప్పినా అవగాహనాలోపం, అర్ధజ్ఞానం ఉన్నవారికి అది చెడుగా వెళ్తుంటుంది.. అది అత్యంత సహజం! ప్రస్తుతం జ్యోతిక ఈ పరిస్థితినే ఎదుర్కొంటుంది. కోలీవుడ్‌ లో నటిగా, హీరో సూర్య భార్యగా జ్యోతికపై అందరికీ గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఆమె హీరోయిన్‌గా నటించినా.. పెళ్లి తరవాత వెండితెరకు కాస్త దూరమవడం… ఇప్పుడు తాజాగా ప్రాధాన్యమున్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో కిందటేడాది ‘రాచ్చసి’ (రాక్షసి) సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించగా ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు ‘జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డ్స్ 2020’ ఉత్తమ నటి అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుక జరిగింది. ఈ అవార్డు తీసుకున్న అనంతరం జ్యోతిక చేసిన వ్యాఖ్యలే పండితులం అని చెప్పుకునే కొంతమందికి వేరేగా అర్ధమయ్యాయి.. దాంతో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి!

వివరాళ్లోకి వెళ్తే… ఈ అవార్డును సిమ్రాన్ చేతుల మీదుగా అందుకున్న జ్యోతిక అనంతరం మైకందుకుని.. హాస్పిటల్, స్కూల్స్‌ ను ఇంకా బాగా నిర్వహించాల్సిన అవసరం ఉందని చెబుతూ… ఒక ఆలయాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. అనంతరం ఆమె మాటల్లోనే… “ఈ సినిమా షూటింగ్‌ లో భాగంగా తంజావూర్ వెళ్లడం జరిగింది. అక్కడి బృహదీశ్వర ఆలయం చాలా ఫేమస్ అని తెలిసి అందరం ఆ ఆలయానికి వెళ్లాం. ఉదయ్‌ పూర్‌లో ప్యాలెస్ మాదిరిగా ఎంతో అందంగా ఉంది ఆ ఆలయం. అయితే, ఆ మరుసటి రోజు హాస్పిటల్‌ లో షూటింగ్ చేశాం. ఆ హాస్పిటల్‌ను చాలా దరిద్రంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి నాదొక రిక్వెస్ట్… ఆలయాలను బాగా శుభ్రం చేస్తాం, పెయింట్ వేస్తాం, బాగా మెయింటైన్ చేస్తాం, ఆలయ హుండీలో డబ్బులు వేస్తాం. ఇదే క్రమంలో దయచేసి అవే డబ్బులు హాస్పిటల్స్‌ కు కూడా పెట్టండి, పాఠశాలల అభివృద్ధికి వాడండి.. ఈ రోజుల్లో ఇది చాలా ముఖ్యం. దయచేసి హాస్పిటల్స్ కు, పాఠశాలలకు కూడా విరాళాలు ఇవ్వండి’’ అని అన్నారు. అంతే… ఈ మాటలపై రచ్చ రచ్చ చేసేస్తున్నారు.

జ్యోతిక మాటలు విన్న ఎవరికైనా… కరెక్టుగా చెప్పింది ఆమె అనిపించక మానదు. కానీ… కొంత మంది హిందూవాదులకు మాత్రం జ్యోతిక మాటల్లో బూతుల్లాంటి పదాలు కనిపించాయంట! దీంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పే పనేలేదు! “జ్యోతిక హిందూ ఆలయాలనే ఎందుకు అంటున్నారు? ఇతర మతాల మందిరాలపై ఎందుకు వ్యాఖ్యలు చేయలేదు?’’ అంటూ అర్ధం పర్థం లేని వాదనకు తెరలేపారు! తాజాగా శ్రీవిల్లిపుత్తూర్ ఆండాల్ ఆలయ స్వామిజీ శ్రీ శథగోప రామానుజ జీయర్.. జ్యోతిక వ్యాఖ్యలను తెగ ఖండించేశారు. తంజావూర్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా జ్యోతిక మాట్లాడారని మండిపడ్డారు. జ్యోతిక మాటల్లో కలిగిన ఆ భంగం ఏమిటో పండితులైన ఆ స్వామీజీ కే తెలియాలి!

ఆయన మేధావితనం అలా ఉంటే… సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, చిన్నలు, ఆమె అభిమానులు… జ్యోతికకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జ్యోతిక మాట్లాడిన దానిలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అర్థంకాకపోతే మరోసారి వినండి.. అప్పటికీ అర్ధంకాకపోతే మరోసారి స్పష్టంగా వినండి అంటూ సూచనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news