ఆ క్షణాలు ఎంతో అద్భుతం.. ఎప్పటికీ మరిచిపోను : సూర్య

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని నటుడు సూర్య అన్నారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సంలో ఆయన ‘‘సురారై పోట్రు’ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.

తనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు సూర్య కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ క్షణం ఎంతోమందికి థ్యాంక్స్‌ చెప్పాలి. ముఖ్యంగా చిత్ర దర్శకురాలు సుధాకొంగరకు. కొవిడ్‌ సమయంలో ఈ సినిమా అందరిలో ఒక ధైర్యాన్ని నింపింది. ఆమె పదేళ్ల కష్టమే ఈ సినిమా. జాతీయ అవార్డుతో మా ప్రయాణం సఫలీకృతమైందనుకుంటున్నా. మా చిత్రానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి.. ఇంతకు మించిన గౌరవం ఇంకేం ఉంటుంది. ఈ అవార్డు మాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే.. ఉత్తమ చిత్రంగా ఒక తమిళ చిత్రం ఎంపికై సుమారు 13 ఏళ్లు అవుతోంది. ఇక, నా సతీమణి జ్యోతిక.. తానెప్పుడూ నాపై  వెలుగుని ప్రసరిస్తూనే ఉంటుంది. నా కంటే ముందు తానే ఈ సినిమాపై నమ్మకం ఉంచింది. రాష్ట్రపతి చేతులమీదుగా ఆమె అవార్డు అందుకోవడం చూసి నేనెంతో సంతోషించా’’ అని సూర్య పేర్కొన్నారు.