కథ:
పేద ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో తన తండ్రి వైఎస్ రాజారెడ్డి కలను నిజం చేసేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) రాజకీయాల్లోకి వస్తారు. ఈ క్రమంలోనే దిన దిన ప్రవర్ధమానం ఆయన ప్రజల్లో ఉంటూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుంటారు. అయితే ఆ సమయంలోనే మన దేశం పార్టీ (పేరు మార్చారు) మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని చెప్పి అసెంబ్లీని రద్దు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలిచి పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని వైఎస్ పాదయాత్ర చేపడతారు. అందుకు ఆయన స్నేహితుడు కేవీపీ (రావు రమేష్) సహకారం అందిస్తాడు. అయితే పార్టీ (కాంగ్రెస్) హైకమాండ్ మాత్రం పాదయాత్రకు ససేమిరా అంటుంది. అయినా వినిపించుకోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి (సుహాసిని) నియోజకవర్గం నుంచి పాదయాత్ర ఆరంభిస్తారు. ఈ క్రమంలోనే పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. అయితే అదే సమయంలో ప్రత్యర్థి పార్టీ (మన దేశం) లో లుకలుకలు వస్తాయి. ఆ పార్టీ నేతలు అరెస్టులను, వెన్నుపోట్లను, కోవర్టు రాజకీయాలను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతుంటారు. దీంతో వైఎస్ పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ (కాంగ్రెస్) కూడా వైఎస్ చెప్పినట్లు చేస్తుంది. వైఎస్ చేసే పనులకు సహకారం అందిస్తుంది. అయితే చివరకు వైఎస్ ఏం చేస్తారు ? సీఎం అయి పేద ప్రజలకు అండగా నిలబడాలనుకున్న తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు ? అందుకు ఏమైనా అడ్డంకులు వస్తాయా ? తండ్రికి ఇచ్చిన మాట కోసం మడమ తిప్పని నాయకుడిగా ఎలా మారారు ? ప‌్రజల మన్ననలతో ఆయన అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని ఎలా నడిపారు ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే ‘యాత్ర’ సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
నటీనటులు-సాంకేతిక నిపుణుల పనితీరు:
మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉత్తమ నటుడిగా పలు సార్లు అవార్డులను కూడా అందుకున్నారు. అయితే మొదట్లో ఆయన్ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రకు తీసుకున్నారేంటి ? అని చాలా మంది భావించారు. కానీ అందరి అంచనాలను తారు మారు చేస్తూ మమ్ముట్టి వైఎస్ పాత్రకు జీవం పోశారనే చెప్పవచ్చు. వైఎస్ హావభావాలు, ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇంట్లోని సభ్యులతో ఆయన మాట్లాడే తీరు, ఆయన రాజసం, ఠీవి తదితర భావాలను మమ్ముట్టి చక్కగా పలికించారు. ప్రత్యేకించి వైఎస్ చేయి ఊపే తీరును మమ్ముట్టి చక్కగా అనుకరించారు. ఇక వైఎస్ కు అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ పాత్రలో రావు రమేష్ ఇమిడిపోయారు. అలాగే వైఎస్ తండ్రిగా నటించిన జగపతి బాబు ఆ పాత్రలో జీవించారు. సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, విజయమ్మగా బాహుబలి ఫేమ్ ఆశ్రిత వేముగంటి, పోసాని కృష్ణమురళి, మన దేశం నాయకులుగా జీవి, పృథ్వీ, కేశవ రెడ్డి పాత్రలో వినోద్ కుమార్, వి.హనుమంత రావు పాత్రలో తోటపల్లి మధు, కాంగ్రెస్ హైకమాండ్ నేతగా సచిన్ ఖేడేకర్‌లు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు.
సాధారణంగా రాజకీయ నాయకుడి బయోపిక్ అంటే అది డాక్యుమెంటరీ చిత్రంగా అనిపిస్తుంది. కానీ యాత్ర చిత్రాన్ని దర్శకుడు మహి వి.రాఘవ్ చక్కగా తెరకెక్కించారు. ఆయన కథను నడిపించే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన స్క్రీన్ ప్లే కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. వైఎస్ భావోద్వేగాలను మమ్ముట్టి అంత చక్కగా పలికించారంటే అందుకు దర్శకుడి ప్రతిభే కారణమని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా నిజానికి చాలా సీరియస్ సాగిపోతూ ఉన్నప్పటికీ మధ్యలో వచ్చే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బ్రేక్‌లుగా అనిపిస్తాయి. కానీ ప్రేక్షకుల మూడ్‌ను పాజిటివ్‌గానే ముందుకు తీసుకువెళ్లే విధంగా వాటిని తీర్చిదిద్దారు. ఇక తమిళ యుత సంగీత దర్శకుడు కే అందించిన సంగీతం బాగుంది. సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నాయి. వెరసి యాత్ర సినిమాకు సాంకేతిక నిపుణులు కూడా తమ శక్తి మేర కృషి చేశారు. అలాగే చిత్ర నిర్మాతలు ‘యాత్ర’ సినిమాను చక్కని ప్రొడక్షన్ విలువలతో తీశారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో ఆయన చేపట్టిన పాదయాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రెండు సార్లు సీఎం అవడానికి అదే కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పాదయాత్ర కథాంశంతో తీసిన యాత్ర సినిమా ఓవరాల్‌గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. వైఎస్ అభిమానులకు ఈ సినిమా పండగలాంటిదనే చెప్పవచ్చు. కానీ అటు టీడీపీ శ్రేణులకు మాత్రం ఈ సినిమా ఎలాగూ నచ్చదు. ఒక సన్నివేశంలో అసలు ముందు సీన్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఓటుకు నోటు వ్యవహారం గుర్తుకు తెస్తారు. చంద్రబాబునాయుడు వాయిస్ ను పోలిన వాయిస్ ను వినిపిస్తారు. అయితే ఈ సీన్‌ను టీడీపీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేవు.
ముగింపు: పాదయాత్ర సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి భావోద్వేగాలను, పేద ప్రజల కోసం ఆయన పడిన కష్టాలను తెలుసుకోవాలంటే.. యాత్ర సినిమా చూడాల్సిందే..!
రేటింగ్: 4/5