మహానగరాల్లో నిత్యం రహదారులు ఎంత రద్దీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. వాహనాలతో రోడ్లన్నీ కిక్కిరిసి పోతుంటాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జాంలో వాహనదారులు చిక్కుకుంటారు. ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేందుకు చాలా సమయం పడుతుంటుంది. ఇక అలాంటి ట్రాఫిక్ జాంలలో ఆంబులెన్సులు చిక్కుకుంటే ఇక అప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ తరహా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా బైక్ ఆంబులెన్స్ సర్వీసులను ప్రారంభించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ లు ఈ సేవలను ఢిల్లీ సెక్రటేరియట్ వద్ద ప్రారంభించారు.
ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ ఆంబులెన్స్ సర్వీసులను ఫస్ట్ రెస్పాండడర్ వెహికల్స్ అని పిలుస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 16 బైక్ ఆంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం రూ.23 లక్షలను ఖర్చు చేసింది. ఇక ఈ బైక్ ఆంబులెన్స్ లు తూర్పు ఢిల్లీలోని జేజే క్లస్టర్‌లో ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఢిల్లీ మొత్తం ఈ బైక్ ఆంబులెన్స్ సేవలను ప్రారంభించనున్నారు.
మహానగరాల్లో రోడ్లపై ఉండే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఆంబులెన్స్‌లలో ఒక్కోదాంట్లో పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రెస్సింగ్ మెటీరియల్, ఎయిర్ స్ప్లింట్స్, జీపీఎస్, కమ్యూనికేషన్ డివైస్ తదితర వస్తువులు ఉంటాయి. ప్రజలు ఎమర్జెన్సీ సమయాల్లో కాల్ చేస్తే ఎంతటి ట్రాఫిక్ జాం ఉన్నా వెంటనే వారి వద్దకు వెళ్లేందుకు ఈ బైక్ ఆంబులెన్స్ లు అనువుగా ఉంటాయి. అయితే దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఈ బైక్ ఆంబులెన్స్‌లను ప్రవేశపెడితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.