రాతి ఎడారిలో వర్ష బీభత్సం.. 27 ఏళ్లలో ఇదే మొదటిసారి

-

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాతి ఎడారి ప్రాంతంగా పేరొందిన ఫుజైరాతోపాటు షార్జాలో కురిసిన భారీ వర్షం.. ఆకస్మిక వరదలకు కారణమయ్యింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతోపాటు దుకాణాలు, వాహనాలు నీటమునిగాయి.


రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం.. సహాయ కార్యక్రమాలను చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన వందల మందిని రక్షించడంతోపాటు సుమారు 4 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించాయి. గత రెండు రోజులుగా ఫుజైరాలో కురిసిన వర్షపాతం 27 ఏళ్లలోనే అధికమని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఎమిరేట్‌ ఆఫ్‌ ఫుజైరా.. నీరులేని పర్వత ప్రాంతాలు, రాతి నేలలు, మైదాన ప్రాంతాల మిశ్రమం. అయితే, గత కొన్ని రోజులుగా అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. రెండు రోజులపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఫుజైరాలో 25.5సెం.మీ రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. సమీపంలోని మసాఫీ గ్రామంలో 20.9 సెం.మీ, ఫుజైరా ఎయిర్‌పోర్టు సమీపంలో 18.7సెం.మీ వర్షపాతం చోటుచేసుకుంది.

గడిచిన 27ఏళ్లలో యూఏఈలో ఈస్థాయి వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల దాటికి పర్వత ప్రాంతాలకు దిగువన ఉన్న గ్రామాలు మొత్తం నీటితో మునిగిపోయాయి. మరోవైపు దుబాయ్‌, అబుదాబీ నగరాల్లో మాత్రం తేలికపాటి వర్షమే కురిసినట్లు సమాచారం. ఇలా ఎడారి దేశంలో అరుదుగా చోటుచేసుకున్న వరదలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news