ధన త్రయోదశి. ధన్వంతరి పుట్టినరోజును ధనత్రయోదశి అంటారు. ఆ రోజు ధన్వంతరికి పిండి దీపం పెడితే ఎంతో మంచిది. చాలామంది ధనత్రయోదశి రోజు పిండి దీపం పెడుతుంటారు. నిజానికి పిండి దీపం ఎందుకు పెడుతుంటారో ఆ వివరాలు తెలుసుకుందాం..
గోధుమ పిండితో ఒక ప్రమిదను తయారుచేయాలి. దాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. పచ్చిపిండిలో నూనె పోయరాదు. అది దీపానికి పనిచేయదు. ఆరిన తరువాత ఆవనూనె పోసి ఒత్తులు వెలిగించాలి. అది కూడా 6 నుంచి 7 గంటల మధ్య సాయంత్రం సమయంలో వెలిగించాలి. అందులో నూనె 4 గంటల నుంచి 5 గంటల వరకు వెలిగేలా చూసుకోవాలి.
ఈ దీపం ఎవరి కోసం!
ఈ దీపాన్ని యముడి కోసం వెలిగిస్తారు. మృత్యువు నుంచి, మృత్యు భయం పోవాలని దీపాన్ని వెలిగించాలి. పిండి దీపం మన చేత్తో మనమే తయారుచేస్తాం కాబట్టి సంవత్సరమంతా ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకూడదని, అలాగే సంవత్సరమంతా ధన, ధాన్యాలతో సుఖసంతోషాలతో జీవించేలా కాపాడమని యముడిని కోరతాం. నాలుగు వత్తులు పెట్టి నాలుగు దిశల్లో కోరడం వల్ల ఎటువైపు నుంచి దుష్ట శక్తి అయినా మాపైకి వస్తే మీరే కాపాడాలని ఆ వత్తులను వెలిగిస్తాం. ఆరోగ్యంగా ఉండటానికి ధన్వంతరి అభయమిస్తారు. ఇక ఆలస్యమెందుకు ఈ సారి ధనత్రయోదశినాడు ధర్మం తప్పని యమధర్మరాజును ప్రార్థించి ఆయురారోగ్యాలను పొందండి.