వినాయకుడు పిలిస్తేనే మీరు ఆ గుడికి వెళ్లగలరు.. ఇంతకీ అదెక్కడుందంటే..?

-

మేం తిరుమల వెళ్లాలని రెండేళ్లుగా అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు. అయినా మనం వెళ్లాలనుకుంటే సరిపోతుందా. స్వామి మనల్ని పిలవాలి. అప్పుడే ఏ ఆటంకం లేకుండా వెళ్లగలుగుతాం అని అంటుంటారు. ఇది కొంతవరకు నిజమేనని పండితులు చెబుతుంటారు. స్వామి తన భక్తులను తానే తన వద్దకు పిలుస్తాడని పురాణాల్లో చెప్పేవారు. అలా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉన్న కురుడుమలై శక్తి గణపతి కూడా తన వద్దకు తన భక్తులను పిలుస్తాడట. అంతే కాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే..?

బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరం కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కురుడుమలై శక్తి గణపతి కొలువుదీరాడు. ఇక్కడ బొజ్జగణపయ్యని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. సుమారు 14అడుగుల ఎత్తున్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిలతో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుడు)ప్రతిష్టించారని ప్రతీతి.

త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని పురాణాల్లో ఉంది. త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు కూడా ఈ శక్తి గణపతిని సేవించారని అక్కడి స్థలపురాణం. లంబోదరుడు స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కలలో కనిపించి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని చెప్పినట్టు అక్కడుకున్న శిలాశాసనాలు చెబుతాయి. అప్పట్లో దీన్ని కూటాద్రి అని పిలిచేవారని కాలక్రమంలో అది కాస్త కురుడుమలెగా పేరుగాంచిందని చెబుతున్నారు.

ఈ ఆలయానికి 2000 ఏళ్ల చరిత్ర ఉందని ఆర్కియాలజీ అధికారులు తెలిపారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ  రాత్రిసమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని స్థానికులు నమ్ముతుంటారు. అర్ధరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపించడం ఈ నమ్మకానికి మరింత ఊతమిస్తోంది.

ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, మీరు చేస్తున్న పనిలో ఏవైనా విఘ్నాలు ఎదురైనప్పుడు శక్తి గణపతిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయానికి మనం అనుకుని ప్లాన్ చేసుకుంటే వెళ్లలేమట. కేవలం ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే వెళ్లగలమని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news