నర దిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అంటారు.. నిజంగానే ఇది జరుగుతుందో లేదో కానీ.. జనాలు మాత్రం ఈ సమెతను బాగా నమ్ముతారు. మన కంటి నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ ఎదుటి వస్తువుపై అంతటి ప్రభావాన్ని చూపుతుందని ఈ సామెత అర్థం. కళ్ల ద్వారా పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలు రెండూ కూడా వెలువడుతాయి. ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగెటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడినప్పుడు కళ్లు తిరగడం, తీవ్రంగా తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనినే దిష్టి అంటారు. దుష్ట శక్తులను తనలో దాచుకోగలిగిన శక్తి గుమ్మడికాయకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అందుకే గృహ ప్రవేశ సమయంలో గుమ్మం ముందు కాశీ గుమ్మడికాయను పగలకొట్టి బూడిద గుమ్మడికాయను సింహద్వారానికి ఎదురుగా వేలాడ దీస్తారు. గుమ్మడికాయను ఇంటి ముందు ఎలా కట్టాలి.. అది పాడైతే ఏవిధంగా భావించాలి.. గుమ్మడికాయను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి ఈ విషయాలు చూద్దాం..
నాణ్యమైన బూడిద గుమ్మడికాయను తీసుకుని దానికి శాస్త్రం ప్రకారం కూష్మాండ పూజ చేయించి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉట్టిలో వేలాడదీయాలి. రోజూ మన ఇంట్లో పూజ చేసిన ధూపాన్ని గుమ్మడికాయకు కూడా చూపించాలట. అప్పుడే దానిలోని శక్తి మరింత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. మన ఇంటికి కట్టిన గుమ్మడికాయ పాడైనా, త్వరగా ఎండిపోయినా మన ఇంటికి దిష్టి ఎక్కువగా తాకిందని భావించాలి.
ఇలా పాడైన గుమ్మడికాయను అశ్రద్ధ చేయకుండా వెంటనే తొలగించి వేరే గుమ్మడికాయను కట్టుకోవాలి. పాడైన గుమ్మడికాయను పడేయకుండా ప్రవహించే నీటిలో వేయాలి. అలాగే దిష్టి గుమ్మడికాయకు ఇంట్లో మైల గాలి తగిలినా, గ్రహణం వచ్చినా, ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయినా అది దాని శక్తిని కోల్పోతుంది. ఇలాంటి సమయాల్లో కూడా గుమ్మడికాయను మార్చుకోవాలి. దిష్టి గుమ్మడికాయను సొంత ఇంటి వారే కట్టుకోవాలి అంటారు. అలా ఏం లేదు.. అద్దెకు ఉంటున్న ఇంటివారైనా కూడా గుమ్మానికి దిష్టి గుమ్మడికాయను కట్టుకోవచ్చు.