మునగ కాయలంటే.. అందరికీ ఇష్టం ఉండే ఉంటుంది. అసలు మునగకాయలతో సాంబార్ చేస్తే ఉంటుంది.. ఆహా.. కడుపునిండా తినేయొచ్చు. మునగ చెట్టులో ఉండే ప్రతీదీ ఆరోగ్యానికి మంచిదే..ఆకులు, కాడలు, కాయలు అన్నీ. అయితే చాలామంది ఊర్లల్లో కూడా మునగ చెట్టును పెంచుకోవడానికి ఇష్టపడరు. పెద్దలు కూడా ఇంట్లో మునగ చెట్టు ఉంచుకోకూడదని చెప్తుంటారు. ఎందుకు ఇంత మంచి చెట్టు ఇంట్లో ఉంటే ఆరోగ్యమే కదా..! ఎందుకు వద్దంటున్నారు.?
కారణం ఇదేనట..!
మునగ చెట్టు కొమ్మలూ, కాయలు బాగా తీయగా ఉంటాయి. ఇవి ఇలా తీయగా ఉండడం వలన పురుగులను, ఇతర క్రిమి కీటకాదులను ఆకర్షిస్తాయట. వీటికి తీయగా ఉండే ఆహార పదార్ధాలు ఇష్టం కాబట్టే మునగ చెట్టు ఎక్కితే వదలవు. అలా ఇంటి చుట్టూ పక్కల మునగ చెట్టు ఉండడం వల్ల ఈ పురుగులు కూడా ఇంటి పరిసరాల్లోనే సంచరిస్తూ ఉంటాయి. అంతేకాదు.. గొంగళి పురుగులు లాంటివి అయితే పొరపాటున జారి వంటిపై పడితే అబ్బో ఇక నరకం కనిపిస్తుంది.
కళ్లకు కూడా ప్రమాదమే..!
వాటి ఉమ్మి తీగలా ఉండి జారుతూ ఉంటుంది. ఇది కంటిపైనా లేదా చర్మంపైన పడితే ఒకరకమైన అలర్జీ కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. కంట్లో పడితే మాత్రం కళ్ళు పుసికట్టి మూసుకుపోతాయి. తిరిగి మాములు అవ్వడానికి రెండు మూడు రోజుల నుంచి.. వారం రోజులైనా పడుతుందట.. ఇక మునగ కొమ్మలు బలహీనంగా ఉండి గట్టిగా గాలివాటం వస్తే పడిపోతాయి. ఆ సమయంలో చిన్నపిల్లలు ఆ ప్రదేశంలో ఆడుతుంటే.. వారిపై పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించే మన పెద్దలు ఇంట్లో మునగచెట్టుని పెంచొద్దని చెప్పేవారు. పెద్దవాళ్లు ఏం చెప్పినా వాటికి వందకారణాలు ఉంటాయి.. కానీ మనం వాటిని గుర్తించడంలోనే ఆలస్యం జరుగుతుంది. ఇంటి దగ్గర్లో కాకుండా.. ఊర్లల్లో దొడ్లల్లో ఇలాంటివి పెంచుకునేవారు. అక్కడ అయితే ఎవరూ ఉండరు కాబట్టి సేఫ్ అనమాట.! ఇంతకీ మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా..?