అధికారుల నిర్లక్ష్యం వల్ల బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు మనం చాలానే చూశాం. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. బోరు బావిలో పడి బతికి బయట పడిన చిన్నారులు చాలా తక్కువ. కానీ ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. కేవలం 40 నిమిషాల్లోనే బాలుడిని కాపాడారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలోని పొలంలో రెండేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. దుదాపూర్ గ్రామంలోని పొలంలో ఆడుకుంటూ మంగళవారం రాత్రి 8 గంటలకు బాలుడు బోరు బావిలో పడిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాలుడు 20-25 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాత్రి 10:45 గంటలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం బాలుడిని ధృంగాద్ర పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.