ఎడిట్ నోట్: బీఆర్ఎస్ విత్ టీడీపీ..!

మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ ఖరారైపోయింది..దసరా రోజు మధ్యాహ్నం పార్టీని ప్రక్టించనున్నారు. అయితే కొత్తగా పార్టీ ఏర్పాటు చేయకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చనున్నారు. తెలంగాణ భవన్‌లో పేరు మారుస్తూ తీర్మానిస్తారు. ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్ 6న ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాని(సీఈసీ)కి పార్టీ మార్పు తీర్మానాన్ని సమర్పిస్తారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే జాతీయ పార్టీ ఏర్పాటు చేసినా వచ్చే నెలలో జరిగే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలుస్తోంది.

మొత్తానికి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారి జాతీయ పార్టీ కానుంది..ఇకపై కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్నారు. ఇటు కేటీఆర్ ఏమో రాష్ట్రంలో కీలకపాత్ర పోషించనున్నారు. అయితే తెలంగాణలో పార్టీకి పట్టు ఉంది గాని..ఇతర రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు ఆ పట్టు పెంచుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిసింది. ఏపీపై ఎక్కువ ఫోకస్ పెట్టి..అలాగే తెలుగు ప్రజలు ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా లాంటి రాష్ట్రాలపై కూడా ఫోకస్ పెడతారని తెలిసింది.

మొదట ఏపీలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేయనున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీని టార్గెట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పటికే ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని సమాచారం. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీఆర్ఎస్‌లోకి వస్తారని, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప తదితర జిల్లాలకు చెందిన కొందరు నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. వీరిలో కొందరితో కేసీఆరే నేరుగా మాట్లాడారని అంటున్నారు.

అలాగే కొందరు టీడీపీ నేతలు కేసీఆర్‌తో ఉన్న పాత సాన్నిహిత్యంతో..బీఆర్ఎస్‌లో చేరి క్రియాశీలకంగా ఉండేదుకు చూస్తున్నారట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గాని..మొదట ఈ అంశాన్ని తీసుకొచ్చిందే టీడీపీ అనుకూల మీడియా. కేసీఆర్ ఏపీలోని టీడీపీని టార్గెట్ చేయబోతున్నారని కథనాలు ఇచ్చింది. అయితే ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ అనే విదంగా రాజకీయ యుద్ధం నడుస్తుంది..ఇలాంటి తరుణంలో ఏపీలో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చి..రాజకీయాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతారనేది ఆసక్తికరంగా మారింది. అసలు కేసీఆర్ జాతీయ పార్టీలోకి చేరికలు ఉంటాయా? ఏపీలో ఎంతవరకు ప్రభావం చూపగలరు అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.