ఎడిట్ నోట్: ‘మూడు’ ముచ్చట తీరేనా..!

-

దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు…ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ పెద్దగా వినలేదు. అయితే దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉండేవని, అవి అంతగా సక్సెస్ కాలేదనే ప్రచారం మాత్రం ఉంది…మరి ఎక్కడా లేని విధంగా ఏపీకి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. వాస్తవానికి ఎన్నికల సమయంలో రాజధాని మార్పు విషయంలో జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదు…అసలు అమరావతిని మారుస్తానని చెప్పలేదు.

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతి రాజధానిగా ఉంటుందని అంతా అనుకున్నారు…కానీ జగన్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదే అంటే 2019 చివరిలో అసెంబ్లీలో అభివృద్ధి కోసం మూడు రాజధానులు తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక అక్కడ నుంచి అమరావతి ప్రాంత ప్రజలు ఉద్యమం చేస్తూ వచ్చారు…అటు ప్రతిపక్ష టీడీపీ సైతం అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మూడు రాజధానులు వద్దు….అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే రాజధాని కోసం ఉద్యమించిన రైతులు, ప్రజల టార్గెట్ గా జగన్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లిందో తెలిసిందే.

సరే ఏదొకటి ముందు రాజధాని అంటూ ఒకటి ఉంటే బాగుండు అని జనం అనుకున్నారు. అలాగే మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది వైసీపీ ప్రభుత్వం కాన్సెప్ట్..అలాగే గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అక్రమాలకు పాల్పడిందని, నది పక్కన ఉన్న అమరావతి రాజధానిగా పనికి రాదని, వరద ముంపు ఉంటుందని చెప్పుకొచ్చారు.

అయితే అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని, అన్నీ వసతులు ఉన్న విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని, ఇక రాయలసీమ ప్రజల చిరకాల కోరిక అయిన హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేసి..కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే దీని కోసం మూడు రాజధానుల బిల్లుని పెట్టి, అసెంబ్లీలో ఆమోదించుకుని, మండలిలో మెజారిటీ పెరిగాక తమ పనిని పూర్తి చేసుకున్నారు.

కానీ మూడు రాజధానుల బిల్లుపై అమరావతి రైతులు న్యాయ పోరాటం చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే చాలా నెలల పాటు జరిగిన ఈ పోరాటంలో చివరికి మూడు రాజధానుల బిల్లుని ప్రభుత్వం రద్దు చేసుకుంది…అందులో తప్పులు ఉన్నాయని, మళ్ళీ కొత్త బిల్లు రూపొందించుకుని ముందుకొస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పింది. ఇది ఇంతవరకు జరిగిన మూడు రాజధానుల కథ.

అయితే మధ్య మధ్యలో కొందరు మంత్రులు…విశాఖకు రాజధాని వెళ్లిపోతుందని మాట్లాడుతూ వస్తున్నారు…తాజాగా జగన్ సైతం మూడు రాజధానులు ఏర్పాటు దిశగానే ముందుకెళుతున్నామని చెప్పారు. ఇలా చెబుతున్నారే తప్ప మూడు ముచ్చట మాత్రం తీరడం లేదు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి…ఎలాగో జగన్ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకమని క్లారిటీ వచ్చేసింది..దీని వల్ల అమరావతి ప్రాంతం వైపు వైసీపీకి రాజకీయంగా నష్టం జరిగేలా ఉంది.

అదే సమయంలో మూడు రాజధానులని చెప్పి…ఇంకా ఏర్పాటు చేయకపోవడంపై ఇటు విశాఖ, అటు కర్నూలు ప్రజలు సైతం అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది…ఒకవేళ త్వరలో ఏర్పాటు చేసిన ఎన్నికల ముందు అయిపోతుంది…దీని వల్ల వైసీపీకి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. ఏదేమైనా గాని మూడు రాజధానులు అని చెప్పి…చివరికి ఏపీకి రాజధాని ఏది అంటే…ఏమి చెప్పలేని పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news