ఎడిట్ నోట్: ప్రజల తీర్పే ఫైనల్..!

వైసీపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం..ఇటీవల ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనూహ్యంగా బయటకొచ్చిన మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై రకరకాల చర్చలు జరిగాయి. మొదట దీనిపై ప్రతిపక్ష టీడీపీ పెద్ద ఎత్తున వైసీపీపై విమర్శలకు దిగింది…అలాగే ఎంపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే సాధారణంగా టీడీపీ చేసే ప్రతి విమర్శకు కౌంటర్ ఇచ్చే వైసీపీ మాత్రం…మాధవ్ మ్యాటర్ లో కాస్త ఆచి తూచి వ్యవహరించింది…మాధవ్ కు అనుకూలంగా ఏ వైసీపీ నేత మాట్లాడలేదు. ఎవరికి వారే వీడియో నిజమని తేలితే ఎంపీపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే వీడియో వచ్చిన మొదటరోజే ఎంపీ మాధవ్…టీడీపీ టార్గెట్ గా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అది మార్ఫింగ్ చేశారని, ఇదంతా చంద్రబాబు, లోకేష్, అయ్యన్న పాత్రుడు కుమారుడు, ఏబీఎన్ రాధాకృష్ణ చేయించారని బూతులతో విరుచుకుపడ్డారు. అలాగే కమ్మ కులంపై విమర్శలు చేసేసరికి..ఆ వర్గం వారు ఎంపీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎంపీకి మద్ధతుగా ఆయన సొంత సామాజికవర్గం కురుబ వర్గం నిలబడింది. ఇలా మాధవ్ వ్యవహారం కాస్త కులాల మధ్య రచ్చ మాదిరిగా తయారైంది. కానీ రెండు కులాల వారు సమన్వయం పాటించడంతో…రచ్చ పెద్దది అవ్వలేదు.

 అయితే తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి…నాలుగు గోడల మధ్య జరిగిందని, అందులో నిజనిజాలు తేలితే చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే టీడీపీకి కౌంటర్ గా ఓటుకు నోటు కేసు తీసుకొచ్చారు. వెంటనే హోమ్ మంత్రి వనిత మీడియా సమావేశం పెట్టి..ఆ వీడియో ఫోరెన్సిక్ ల్యాబుకు పంపామని, అసలు విషయం త్వరలోనే తెలుస్తుందని అన్నారు. ఇక తాజాగా దీనిపై అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి…ఫోరెన్సిక్ నివేదిక వివరాలని బయటపెట్టారు.

ఆ వీడియో ఒరిజినల్ లేదా నకిలీనా అనేది తెలియదని చెప్పారు..అలాగే మొదట ఆ వీడియోని ఐటీడీపీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారని వివరించారు. ఇలా అసలు వీడియో ఏది అనేది తెలకపోవడంతో…ఎంపీ మాధవ్ మ్యాటర్ సుఖాంతం అయిందని కథనాలు వస్తున్నాయి. ఇక ఈ అంశంపై టీడీపీ నేతలు ఇంకా ఫైర్ అవుతున్నారు…కావాలని ఎంపీని జగన్ సేవ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈరోజుల్లో ఒక వీడియో ఒరిజినల్ లేదా నకిలీనా అనేది ఈజీగా తేల్చవచ్చని, అయిన ఎంపీ ఫోన్ సీజ్ చేస్తే నిజనిజాలు తెలుస్తాయి అని అంటున్నారు. డర్టీ ఎంపీని కావాలని సేవ్ చేశారని చెబుతున్నారు.

అటు ఎంపీ మాధవ్ యథావిధిగా మరొకసారి మీడియా ముందుకొచ్చి…చంద్రబాబు, లోకేష్, ఏబీఎన్, టీవీ5లపై బూతులు అందుకున్నారు. అంతలా చూడాలని అనిపిస్తే.. మీ ఇంటికి వచ్చి.. నా ఒరిజినల్ చూపిస్తానని వారికి ఎంపీ గోరంట్ల వార్నింగ్ ఇచ్చారు. ఆ విధంగా ఎంపీ మ్యాటర్ అనేక ట్విస్ట్ లతో…చివరికి ఇలా ముగిసింది. అయితే ఈ విషయంపై అటు వైసీపీకి, ఇటు టీడీపీకి…ఎవరి వర్షన్ వారికి ఉంది. కానీ దీనిపై ప్రజలు ఏం అనుకుంటున్నారో మెయిన్ అని చెప్పొచ్చు.

కాకపోతే ప్రజల వర్షన్ ఇప్పుడే తెలియదు…అది ఎన్నికల సమయంలోనే వారి వర్షన్ బయటపడొచ్చు…మాధవ్ ఎలాంటి తప్పు చేయకుండా, టీడీపీనే ఇది కావాలని చేస్తే…హిందూపురం పార్లమెంట్ లో ప్రజలు టీడీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు. అలా కాకపోతే గోరంట్లకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు రావొచ్చు..అలాగే ఆయనకు మళ్ళీ సీటు వస్తుందా? లేదా? అనేది కూడా చూడాలి.