ఆంధ్రా చదువుల్లో అమ్మాయిలే టాప్
కానీ ఎక్కడో ఏదో అసంతృప్తి
కొన్ని వేల కోట్ల రూపాయలను పథకాలకు
వెచ్చిస్తున్నా కూడా ఫలితాలు అరకొరే అయితే
చదువులు నిరర్థకం అవుతున్నాయా?
లేదా ఆ పాటి శ్రద్ధ తీసుకోకుండా తల్లిదండ్రులు మరియు
అధ్యాపకులు ఉన్నారా ?
చదువులు ఎలా ఉన్నాయి. మండే ఎండల మాదిరిగా ఉన్నాయి. వానల్లేని కాలం ఎలా ఉందో అలా ఉన్నాయి. కరోనా కారణంగా చదువులు ఎలా ఉన్నాయి. నిశ్చలత లేని విధంగా ఉన్నాయి. మినిమం సెన్స్ అన్నది లేకుండా, కాన్ఫిడెన్స్ అన్నది అస్సలు లేని విధంగా ఉన్నాయి. అయినా కూడా చదువుకుని మంచి మార్కులతో తల్లీతండ్రీ సంతోషపెట్టాలనే బిడ్డలు అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. వాళ్లే ఆదర్శనీయ ప్రగతికి కారణం అవుతుంటారు. వాళ్లే ఆదర్శనీయ ఫలితాలకు కారణం అవుతుంటారు. అమ్మాయి చదువు అన్నది ఎంతో ముఖ్యం అని భావిస్తోంది దేశం. మన రాష్ట్రం కూడా !
చదువుల కోసమే కదా అన్ని పథకాలను అమలు చేస్తున్నది. సరే ! రాజకీయాల పరంగా ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నా చదువే కీలకం కావాలి కదా ! విద్య అన్నది సుసంపన్నతను పొంది ఉండాలి కదా ! భవిష్యత్-ను నిర్మించే క్రమంలో యువత చదువుపై కాకుండా వేటిపై దృష్టి సారిస్తున్నారని..? ఆ..మొద్దుబారిన బుర్రలతో చదువుల్లో ఎందుకని వెనుకంజలో ఉన్నారని ? తల్లిదండ్రులూ ! ఆలోచించండి..మంచి చదువు, విజ్ఞానం అందించే క్రమంలోనే ఉండండి. వారి నుంచి మీరేం ఆశించకండి.
మీ బిడ్డల ఓటమినో, గెలుపునో సమానంగా చూస్తూనే వారి ఉన్నతికి కారణం కావడం ఓ మంచి పద్ధతి. అమ్మాయిల చదువులను మరింత ప్రోత్సహిస్తూ వెళ్లండి. గాడి తప్పిన కొడుకు చదువును దార్లో పెట్టండి. మీ ఇంటి పేరు నిలబెట్టే పనులే అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చేయాల్సిందే అని మీ బిడ్డలకు పదే పదే చెప్పండి. లేదంటే ఈ చదువులు ఎండాకాలం చదువులే లేదా ఈ చదువులు వానా కాలం చదువులే ! గుర్తు పెట్టుకోండి.
చదువుల్లో ముందుండాలన్న తపనతో అమ్మాయిలు ఉన్నారు. చదువుల్లో వెనుకబాటు వద్దనుకుని చదివేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ విధంగా ఆంధ్రాలో అమ్మాయిలే టాప్. ఇంటర్ ఫలితాల్లో టాప్. టెన్త్ ఫలితాల్లో కూడా టాప్. నిన్నటి వేళ విడుదలయిన ఫలితాల సరళితో అమ్మాయిలు ముందున్నారు అని తేలిపోయింది. ఇంటర్ ఫలితాల్లో మొదటి ఏడాదిలో 60శాతం మంది ఉత్తీర్ణువగా, బాలురు 49శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు 68శాతం మంది ఉత్తీర్ణులవగా, బాలురు 54 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏ విధంగా చూసుకున్నా అమ్మాయిల చదువుల్లో రాణించి మంచి పరిణామం. ఇదే క్రమంలో మరిన్ని రంగాల్లో కూడా ఇదే ఉత్సాహంతో రాణించి ఆంధ్రావనికి వీళ్లంతా పేరు తీసుకుని రావాలని ఆశిద్దాం.