అమరావతికి అదే దగా..!

బోస్టన్ కమిటీ నివేదిక పేరుతో బయటికి వచ్చిన వివరాలు మరీ నవ్వులాటగా ఉన్నాయి. వారి ప్రతిపాదనలను చదివితే వారికి ఆంధ్ర ప్రాంత ప్రజల ఆత్మ గురించి ఏమాత్రం అవగాహన లేదనిపిస్తున్నది. ఇన్ని కమిటీలు వేయడం, అన్ని కమిటీలు ఒకేరకమైన నివేదికలు సమర్పించడం చూస్తుంటే రాజధాని విషయంలో జగన్ పథకం ఏమిటో అర్థమవుతూనే ఉన్నది. చరిత్ర పునరావృతం అవుతున్నది. ఆంధ్ర రాష్ట్రం మరోసారి వంచనపాలవుతున్నది. నాడు నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం వంటి నేతలు చేసిన రాజకీయ వికృత క్రీడనే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారు.

నాడు సంజీవరెడ్డి, ప్రకాశం రాజధాని విషయంలో సాగించిన మోసపూరితమైన విధానాన్నే ఇప్పుడు జగన్ తిరిగి అమలు చేస్తున్నారు. జగన్ ఇంత తొందరగా, ఇలా జారిపడతారని ఎవరూ ఊహించలేదు. మూడు రాజధానుల పేరుతో ఆయన మొదలుపెట్టి రాజకీయ జూదం ఆయన మరింత మరింత కిందికి గుంజుతున్నది. ఆయనకు అర్థం అవుతున్నదో లేదో కానీ, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఆయన శాశ్వతంగా పణంగా పెట్టారు.

రాజధాని ఎక్కడ ఉంటుందో తెలియని ఒక శాశ్వత అపనమ్మకాన్ని ఆయన పురివేసి వదిలారు. ‘ఇప్పుడు ఈయన వచ్చి అమరావతినుంచి ఎత్తేసి మూడు రాజధానులంటున్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చే మరో ముఖ్యమంత్రి రాజధానిని మరోచోటికి తరలించడన్న గ్యారెంటీ ఏముంది? ఇక ఇది అయ్యే పని కాదు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టే విషయం ఆలోచించడం శుద్ధతప్పు’ అని ఒక పారిశ్రామిక వేత్త హైదరాబాద్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఇది ఆయన ఒక్కరి మాట కాదు.

కొన్ని కంపెనీలయితే తమ పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించుకుంటున్నట్టు బాహాటంగానే ప్రకటించాయి. జగన్ మాత్రం ఒక తప్పును కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు. కమిటీలపై కమిటీలు వేసి నవ్వులపాలవుతున్నారు. బోస్టన్ కమిటీ నివేదిక పేరుతో బయటికి వచ్చిన వివరాలు మరీ నవ్వులాటగా ఉన్నాయి. వారి ప్రతిపాదనలను చదివితే వారికి ఆంధ్ర ప్రాంత ప్రజల ఆత్మ గురించి ఏమాత్రం అవగాహన లేదనిపిస్తున్నది. ఇన్ని కమిటీలు వేయడం, అన్ని కమిటీలు ఒకేరకమైన నివేదికలు సమర్పించడం చూస్తుంటే రాజధాని విషయంలో జగన్ పథకం ఏమిటో అర్థమవుతూనే ఉన్నది.

ముఖ్యమంత్రి అనుకున్నదే కమిటీలు చెబుతున్నాయని తెలుస్తూనే ఉన్నది. ఒక ప్రాంతంపై, ఒక కులంపై, ఒక పార్టీపై ద్వేషంతో, అక్కసుతో విధాన నిర్ణయాలు చేస్తే ఎంత విధ్వంసకరంగా మారతాయో జగన్ రాజధానుల పథకం చెప్పకనే చెబుతున్నది. ఈ కమిటీలకు వేటికీ చరిత్రగానీ, అక్కడి ప్రజల మనోభావాలుగానీ, భౌగోళిక సౌలభ్యతలుగానీ పట్టలేదు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సమయంలో జరిగిన చర్చను ఒక్కసారి తిరిగి చూసుకున్నా ఆంధ్ర ప్రాంత నాయకులుగానీ,

రాయలసీమ నాయకులుగానీ ఇవ్వాల ఈ పరిస్థితిని తలెత్తనిచ్చి ఉండేవారు కాదేమో! విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆరున్నర దశాబ్దాల క్రితం ఎలా దగాకు గురయిందో మళ్లీ ఇప్పుడు అటువంటి దగాకే గురయింది. శ్రీబాగ్ ఒప్పందం పేరుతో సంజీవరెడ్డి, ప్రకాశం ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా దెబ్బకొట్టారో ఇప్పుడు జగన్ కూడా అలాగే దెబ్బకొట్టారు. తెలుగు ప్రజలకు స్వరాష్ట్రం సాధించాలన్న ఆంధ్ర ప్రాంత నాయకుల ఆరాటానికి రాయలసీమ నాయకులు అడుగడుగునా అడ్డం తగిలారు.

రాజకీయాధికారాల్లో తమకు అవకాశాలు రానివ్వడం లేదని రాయలసీమ నాయకులు మొదటి నుంచీ ఆంధ్ర నాయకత్వంపై ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఆంధ్ర రాయలసీమల మధ్య ఉన్న ఈ మాత్రం విభేదాలను అటు అరవ నాయకత్వం, ఇటు రాయలసీమ నాయకత్వం విపరీతంగా ఉపయోగించుకుంది. ఇరు ప్రాంతాల మధ్య పూడ్చలేని అపనమ్మకాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. రాజగోపాలచారి మంత్రాంగం అంతా ఇంతాకాదు. ‘ఆంధ్ర తోక లాగా  ఉంటుంది, ఎలా అభివృద్ధి చెందుతుంద’ని అసెంబ్లీలోనే ఎగతాళి చేసిన పెద్దమనిషి రాజగోపాలచారి. నీలం సంజీవరెడ్డ,

ప్రకాశం పంతులు తమతమ రాజకీయ ఇష్టాయిష్టాలకు ఈ వైరుధ్యాలను ఎంతగా ఉపయోగించుకున్నారో చెప్పనవసరం లేదు. ఇద్దరికీ కమ్యూనిస్టులంటే ద్వేషం. కమ్యూనిస్టులు హాజరయిన ఏ సమావేశాలకు, సభలకూ హాజరు కావద్దని ఆదేశాలు ఇచ్చిన పెద్ద మనిషి సంజీవరెడ్డి. రాజగోపాలచారి ఉక్కు పిడికిళ్ల నుంచి తెలుగు ప్రజలను విముక్తి చేయాలన్న ఆరాటంలో రాయలసీమ వారు ఏమడిగినా ఇవ్వడానికి సిద్ధపడ్డారు నాటి ఆంధ్ర ప్రాంత నాయకత్వం. దాని ఫలితమే శ్రీబాగ్ ఒప్పందం.

ఆ ఒప్పందం జరిగింది 1937లో. రాష్ట్రం వచ్చింది 1953లో. అయినా ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కమిటీలు, నివేదికలు, ఓటింగులు గట్రా ఏమీ లేకుండానే ఈ నిర్ణయం జరిగింది. రాజగోపాలచారి మంత్రాంగం, నీలం సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు పైరవీల వల్ల కర్నూలు రాజధానిగా నిర్ణయం జరిగిపోయింది. అధికారుల కమిటీ అక్కడ రాజధాని వద్దని, ఆ నగరం ఏ మూలకూ చాలదని మొత్తుకున్నది.

ఆంధ్ర దేశమంతటా నిరాశానిస్పృహలు వ్యక్తమయ్యాయి. రాజధాని నిర్ణయంపై పునరాలోచన చేయాలన్న డిమాండు అన్ని పార్టీలలోనూ ముందుకు వచ్చింది. కర్నూలు నిర్ణయాన్ని సమర్థించిన గౌతు లచ్చన్న కూడా మనసు మార్చుకుని కొత్త ప్రతిపాదనలు చేశారు. తమ రాజధానిని నిర్ణయించుకునే అధికారం తెలుగు శాసనసభ్యులకే ఇవ్వాలని అన్ని పార్టీలు అంగీకరించాయి. 1953 జూలై 26న అసెంబ్లీలో విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదించాయి వివిధ పార్టీలు.

ఈ సవరణల్లో అతి ముఖ్యమైనవి రాజధాని మార్పుకు సంబంధించినవే. మద్రాసు అసెంబ్లీలోని తెలుగు శాసనసభ్యుల వరకే ఓటింగులో పాల్గొనాలని సంజీవరెడ్డి చెప్పారు. అన్ని పార్టీలూ అదే మాటకు కట్టుబడి ఉండాలని చెప్పాయి. తెలుగు శాసనసభ్యులు మొత్తం 138 మంది. గౌతులచ్చన్న తిరుపతి రాజధానిగా ప్రతిపాదిస్తూ సవరణ తెచ్చారు. ఆయన సవరణకు అనుకూలంగా కేవలం 13 మంది సభ్యులు మాత్రమే ఓటేయడంతో అది వీగిపోయింది.

కూనిశెట్టి వెంకటనారాయణ దొర కర్నూలు బదులు విశాఖ పట్నంను రాజధాని చేయాలని సవరణ ప్రతిపాదించారు. ఆ సవరణకు అనుకూలంగా 16 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదీ వీగిపోయినట్టు ప్రకటించారు. తరిమెల నాగిరెడ్డి విజయవాడ పేరును ప్రతిపాదించారు. వావిలాల గోపాల కృష్ణయ్య విజయవాడ- గుంటూరుల మధ్య రాజధాని ఉండాలని ప్రతిపాదించారు. చర్చ తర్వాత తరిమెల నాగిరెడ్డి తన ప్రతిపాదనను విరమించుకుని, వావిలాల ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు.

వావిలాల ప్రతిపాదనపై ఓటింగ్ జరిగింది. వావిలాల సవరణకు అనుకూలంగా 62 మంది ఓటు చేశారు. వ్యతిరేకంగా 58 మంది ఓటు చేశారు. వీరితోపాటు మరో ఐదుగురు ఆంధ్రేతర ఎమ్మెల్యేలు కూడా సవరణకు వ్యతిరేకంగా ఓటేశారు. చెన్నపురికి చెందిన ఆంథోనీ పిైళ్లె,  హోసూరుకు చెందిన మునిరెడ్డి, విలాత్తిక్కులంకు చెందిన శల్లా దొరై, కేరళ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు అనాలోచితంగానో, ఉద్దేశపూర్వకంగానో ఓటింగులో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు కాంగ్రెస్ వారు.

ఒకరు సోషలిస్టు. ఒకరు ముస్లింలీగ్ చెందినవారు. వారి ఓట్లను పరిగణనలోకి తీసుకోరాదని అన్ని పక్షాల నాయకులూ కోరారు. కానీ స్పీకర్ వీరి వాదనలేవీ పట్టించుకోకుండా వావిలాల సవరణ వీగిపోయినట్టుగా ప్రకటించారు. నాటి కమ్యూనిస్టు ఎమ్మెల్యే తరిమెల నాగిరెడ్డి, ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వావిలాల సవరణకు ఓటేసిన వారిలో ఆంధ్ర నాయకులున్నారు. రాయలసీమ నాయకులున్నారు. ఉత్తరాంధ్రవారూ ఉన్నారు.

‘కర్నూలు నిర్ణయం అసందిగ్ధంగా ఓటమిని పొందింది’ అని అసెంబ్లీలో కమ్యూనిస్టు నాయకుడు తరిమెల నాగిరెడ్డి ప్రకటించారు. పక్క రాష్ర్టానికి చెందిన ఐదుగురు సభ్యులను పరిగణనలోకి తీసుకోరాదని ఆయన అన్నారు. కర్నూలు రాజధాని కావాలనేవారు నీతిబాహ్యమైన పద్ధతులను అనుసరించారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. మెజారిటీ ప్రజల మాట కానీ, మెజారిటీ ప్రజాప్రతినిధుల మాటగానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వినిపించుకోలేదు.  విజయవాడ అందరికీ కేంద్రంగా ఉంటుందని తరిమెల నాగిరెడ్డి వాదిస్తే, ‘అవును కేంద్రమే.దోపిడీలకు, హత్యలకు కేంద్రం.

పట్టపగలు నిలువుదోపిడీలకు కేంద్రం’ అని ప్రకాశం వాదించారు. విజయవాడలో తన విగ్రహాలను కూలగొట్టారన్న ఆగ్రహం ఆయనకు అప్పటికే ఉంది. ఏతావాతా జరిగిందేమంటే అప్పుడు కూడా కమ్యూనిస్టుల అడ్డా అయిన విజయవాడకు సమీపంలో రాజధాని వద్దేవద్దన్న గుడ్డి వ్యతిరేకతతోనే కుట్రలు చేశారు. ఇప్పుడు కూడా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజధానిని అస్థిరం చేయడానికి కుట్ర చేశారు. జగన్ ఆ సామాజిక వర్గంపై ద్వేషంతో ఒక వాస్తవాన్ని విస్మరించారు.

అమరావతి అంతా ఆ సామాజిక వర్గం చేతుల్లో ఉందని ఇప్పుడు అందరినీ నమ్మించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అదే అమరావతి ప్రాంత ప్రజలు వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారన్న సంగతి ఆయన ఎందుకో మరచిపోయారు. అమరావతిని అస్థిరం చేయడం ద్వారా తాను ఆంధ్రకు ప్రతినిధిని కాదని చెప్పకనే చెప్పారు. అత్యంత ఘనవిజయం చేకూర్చిన గోదావరి జిల్లాలు,కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఉత్త పుణ్యానికి దూరం చేసుకున్నారు.

చివరికి అనంతపురం, చిత్తూరు జిల్లాల వారు కూడా జగన్ నిర్ణయాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పనయిపోయిందనుకున్న వారంతా ఇప్పుడు ఆయనవైపు చూడవలసిన పరిస్థితిని జగన్ కల్పించారు. జగన్ తొలి మూడు మాసాలలో సంపాదించుకున్న మంచిపేరు కాస్తా మూడు వారాల్లో బుగ్గిపాలు చేసుకున్నారు. ప్రజలతో సంబంధం లేని నాయకులు అధికారులు కమిటీలు నివేదికలపై ఆధారపడినా, ఆగ్రహంతో, ద్వేషంతో నిర్ణయాలు చేసినా అవి చివరికి ఇటువంటి ఫలితాలనే తెస్తాయి.

ఆంధ్ర ప్రాంత నాయకత్వానికి ఈసారయినా కనువిప్పు కావాలి. అమరావతిని కాపాడుకోలేకపోతే ఆంధ్రకు ఒక సుస్థిర రాజకీయ అర్థిక కేంద్రం ఏర్పాటు కావడం అన్నది ఇక చూడలేము. జగన్ రాజధానుల రాజకీయం వల్ల కర్నూలుకు గానీ, విశాఖకు గానీ వచ్చేదేమీ లేదు. ఇప్పుడు వచ్చేవి శాశ్వతంగా ఉంటాయన్న హామీ కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు జగన్ చేసినట్టే రేపు మరొకరు చేస్తారు. ‘వేవీ జరగవు సార్. ఇదంతా నాటకంలాగా ఉంది. కోర్టులు ఎలా ఒప్పుకుంటాయి. కేంద్రం ఎలా ఒప్పుకుంటుంది. జగన్ స్వయంగా అమరావతికి ఒప్పుకున్నారు. హైకోర్టు అక్కడే పనిచేయడం మొదలుపెట్టింది. జగన్ నిర్ణయాలు న్యాయపరీక్షలో నిలబడలేవు. చూస్తూ ఉండండి’ అని ఒక తలపండిన రాజకీయ వేత్త అభిప్రాయపడ్డారు.

  • ఆర్‌. శ్రీకృష్ణ