భారత్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే హాస్పిటళ్లలో సదుపాయాలు లేక బాధితులు అవస్థలు పడుతున్నారు. లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. తగినంత మంది వైద్య సిబ్బంది లేరు. ఆక్సిజన్, బెడ్లు లేవు. ఈ క్రమంలో దేశంలో ఎక్కడ చూసినా కోవిడ్ బాధితులు హాహాకారాలు చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌పై నోరు మెదపడం లేదు.
దేశంలో లాక్ డౌన్ విధించబోమని ప్రధాని మోదీ గతంలోనే స్పష్టం చేశారు. లాక్‌డౌన్ అనేది చివరి అస్త్రమని అన్నారు. అయితే ప్రాణాల మీదకు వస్తే చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించక తప్పదు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా మారుతుందని కూడా అంటున్నారు. మరి చివరి అస్త్రమైన లాక్‌డౌన్‌ను ప్రయోగించే సమయం ఇంకా రాలేదా ? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా లాక్‌డౌన్‌ను పెట్టాలని మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి.
దేశంలో లాక్ డౌన్‌ను విధించబోమన్న కేంద్రం ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. దీంతో ప్రస్తుతం సగానికి పైగా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి. అంటే రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయని అర్థం. కేసులు పెరిగే కొద్దీ ఒక్కో రాష్ట్రం లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తోంది. కానీ ఈ విషయాన్ని గమనించి కూడా దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై ప్రకటించడం లేదు. అంటే.. రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించుకుని నష్టపోతే ఫర్వాలేదు, దేశవ్యాప్తంగా కేంద్రానికి నష్టం రాకూడదు.. అది వారి ఉద్దేశం. అయితే మరి దేశంలో ప్రస్తుతం దారుణ పరిస్థితి ఉంది కదా, చివరి అస్త్రమైన లాక్‌డౌన్‌ను ప్రయోగించరా, ఇంకా కొంత కాలం ఆగుతారా ? ఇంకా పరిస్థితి దిగజారాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చేస్తారా ? అన్నది చూడాలి.