Manohar Parrikar : సామాన్యశిఖరం

-

అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. కాన్వాయ్‌ ఉండదు. పోలీస్ కేస్‌లలో జోక్యం ఉండదు.

అది గోవా పనాజీ ప్రాంతం….
ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు…ఇంతలో వెనక నుంచి 25 సంవత్సరాల యువకుడు కారుతో పదే పదే హారన్ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని .స్కూటర్ పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి, నేనెవరినో తెలుసా నీకు? ఈ ప్రాంత DSP కొడుకుని.. నాకే దారి ఇవ్వవా అని ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు. వెంటనే ఆ వ్యక్తి సున్నితంగా నవ్వుతూ, బాబూ…నువ్వు DSP కొడుకు వైతే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని బదులిచ్చాడు…ఆ వ్యక్తి ఎవరో కాదు…..అప్పటి గోవా ముఖ్యమంత్రి , నిన్నటి వరకు దేశ రక్షణ మంత్రి, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి… మనోహర్‌ పర్రీకర్‌.


అంతకుముందు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్థితులలో వాడే బూట్లను ఒక్కొక్క జత 25,000 రూపాయల చొప్పున ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు. పారికర్ రక్షణశాఖ భాద్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తూ, బూట్లను 25,000 రూపాయలకు కొనుగొలు చేయడం చూసి, వాటిని దిగుమతి చేసుకోవడానికి బదులు భారత్ లోనే తయారుచేయించాలని భావించారు. అయన వీటి గురించి వాకబు చేయడంతో అవాక్కయ్యే అంశాలు వెలుగులోకి వచ్చాయి …అ బూట్లను తయారు చేస్తోంది మనరాజస్థాన్ లొనే. అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రయిల్ వెళ్ళి మరలా అక్కడి నుండి మనం వాటిని అధిక ధరలకు దిగుమతి ,చేసుకుంటున్నామని తెలియడంతో ఆశ్చర్యపొయిన పర్రీకర్‌, వెంటనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకు రమ్మని రక్షణశాఖాధికారులను ఆదేశించారు. అయితే సమయానికి డబ్బులు చెల్లించరని, బిల్లులు త్వరగా పాస్ కావని భారత రక్షణశాఖ వొప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించకపొవడంతో, ఆయనే స్వయంగా యాజమాన్యాన్ని కలుసుకుని డబ్బు చెల్లింపులలో ఒక్క రోజు ఆలస్యమైనా తనకు ఫొను చేయమని తన వ్యక్తిగత ఫోన్ నంబర్ యిచ్చి ఒక్కొక్క జత షూస్ 2200 లకు అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మనోహర్‌ పర్రీకర్‌ పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

వ్యక్తిత్వ భూషణుడు

దేశంలోనే భూతద్దం పెట్టి వెతికినా దొరకరు ఇలాంటి సామాన్యజీవితం ఉన్న ముఖ్యమంత్రి. చిన్న చిన్న సర్పంచ్, MPTC పదవులకే పెద్ద పెద్ద డాంబికాలకు పోయే ఈ కాలంలో ….ఒక వ్యక్తి కొరకు రాష్ట్రం, కేంద్రం డిమాoడ్ చేయటం చూస్తుంటే పర్రీకర్‌ నిజాయితీ ఏ పాటిదో అర్థమౌతుంది. అదే పట్టుదల, సామర్థ్యం, నమ్మకం గల వ్యక్తికి ఉండే గుర్తింపు.

మనోహర్ పర్రీకర్‌.. ఒక సామాన్య ముఖ్య మంత్రి

అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు. ప్రోటోకాల్ ఉండదు. కాన్వాయ్‌ ఉండదు. పోలీస్ కేస్‌లలో జోక్యం ఉండదు. ఆ నిజాయితీ, నిబద్ధతను చూసి కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది. ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు. ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినపుడు యావత్ గోవా కంట తడి పెట్టింది. రాజకీయ నాయకులు అంటేనే చిన్నచూపు ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతుంటే ప్రజలు కన్నీరు పెట్టారంటేనే ఆయన ఎటువంటి నాయకుడో ఇట్టే చెప్పొచ్చు.

ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగేస్తాడు. బడ్డీ కొట్టు లో టీ తాగుతాడు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టులో తెలిసినంతగా మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.

గోవా ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సిఉంది. ఎంతోమంది దేశవిదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇంతలో కాన్ఫరెన్స్‌ హాల్ ముందు కారు ఆగింది. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బ్యాగ్, మరో చేత్తో ఫైళ్లతో మామూలుగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. వెనుకగా వచ్చిన సెక్యూరిటీని.. ఎక్కడ మీముఖ్యమంత్రి అని నిర్వాహకులు అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పారట సెక్యూరిటీవాళ్లు. అతిమామూలుగా లోపలికి వెళుతున్న పర్రీకర్‌ను అక్కడి గేట్‌ భద్రతాసిబ్బంది ఆపి, ఎవరు మీరు.? అలా ఎలా లోపలికివెళ్తారని అడ్డగించగా, పరుగెత్తుకువచ్చిన ఆయన సెక్యూరిటీ, ఆయనే ముఖ్యమంత్రి అని చెబితే బిత్తరపోవడం వారి వంతయింది.

1955లో గోవాలో జన్మించిన పర్రీకర్‌, అక్కడే హైస్కూల్‌ విద్యనభ్యసించి, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ కోసం ఐఐటి-బాంబేలో చేరాడు. ఒక ఐఐటి పూర్యవిద్యార్థి శాసనసభ్యుడు కావడం భారత్‌లో అదే మొదటిసారి. 2001లో అదే ఐఐటి తన పూర్వవిద్యార్థిని ఘనంగా సత్కరించింది. స్కూల్‌లో ఉన్నప్పుడే ఆర్‌ఎస్‌ఎస్‌లో జాయినయి, ముఖ్యశిక్షక్‌గా ఎదిగాడు. ఇంజనీరింగ్‌ చేస్తున్న సమయంలో కొంత విరామమిచ్చినా, తర్వాత మళ్లీ ఆరెస్సెస్‌లో క్రియాశీలకంగా మారి, 26ఏళ్ల వయసులోనే సంఘ్‌చాలక్‌గా సేవలందించాడు. అప్పుడే రామజన్మభూమి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పర్రీకర్‌ను బిజెపిలో చేరాల్సిందిగా ఆరెస్సెస్‌ పంపింది. 1994లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయిన పర్రీకర్‌, 1999లో ప్రతిపక్షనాయకుడిగా పనిచేశాడు. 2000వ సంవత్సరంలో గోవా ముఖ్యమంత్రిగా తొలిసారి ఎన్నికయిన పర్రీకర్‌, తన వినూత్నపాలనతో గోవాప్రజల మన్ననలను చూరగొన్నాడు. 2014లో ఉన్న రెండు లోక్‌సభ సీట్లను గెల్చుకున్న బీజెపి, పర్రీకర్‌ను కేంద్రమంత్రివర్గంలో చేరాల్సిందిగా ఆహ్వానించింది. దానికి విముఖంగా ఉన్న పర్రీకర్‌ను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుజ్జగించి, తన క్యాబినెట్‌లో రక్షణమంత్రిగా చేర్చుకున్నారు.

ఎంతో పేదకుటుంబంలో పుట్టినా, పట్టుదలతో చదివి ఐఐటీలో ప్రవేశం సంపాదించిన పర్రీకర్‌ కొంతకాలం స్వంతంగా వ్యాపారం కూడా చేశాడు. ముఖ్యమంత్రిగా, దేశ రక్షణమంత్రిగా పనిచేసినా, ఎంతో నిరాడంబరంగా జీవించాడు. నిబద్ధతతో వ్యవహరించాడు. ఒక రాజకీయనాయకుడు ఎలా ఉండాలో, ఈ దేశానికి నేర్పాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్నా, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు. ఒక వ్యక్తి తన బాధ్యతల పట్ల, ఎంత నిజాయితీగా, జాగరూకతతో ఉండాలో నేటి యువతకు మార్గనిర్దేశనం చేసిన మహామనీషి మనోహర్‌ పర్రీకర్‌.

తరాల అంతరం గురించి ఆయన చెప్పిన స్వీయానభవం.. ఆయన మాటల్లోనే..

‘‘నేను గోవాలోని పర్రా అనే గ్రామంలో పుట్టాను. అందుకనే మమ్మల్ని పర్రీకర్‌లు అంటారు. మా గ్రామం పుచ్చకాయలకు బాగా ప్రసిద్ధి. ప్రతియేటా పంట చేతికొచ్చే సమయంలో మాఊళ్లో పిల్లలకు పుచ్చకాయలు తినే పోటీ పెట్టేవారు. పిల్లలందరినీ పిలిచి వారు తినగలిగినన్ని పుచ్చకాయలు ఇచ్చి తినమనేవారు. తర్వాతికాలంలో నేనే ఇంజనీరింగ్‌ చదవడానికి బాంబే వెళ్లాను. తిరిగి గ్రామానికి వచ్చేసరికి ఆరున్నర ఏళ్లు పట్టింది. వచ్చీరాగానే నేను మార్కెట్‌కు వెళ్లాను. అక్కడ పుచ్చకాయలు లేవు. ఉన్న కొన్నోగొప్పో కూడా చాలా చిన్నగా ఉన్నాయి. వెంటనే నేను అక్కడ ఉన్నపుడు పోటీ పెట్టే రైతు ఇంటికి వెళ్లాను. ఆయన లేరు. ఆయన కొడుకు ఇప్పుడు ఆ వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఈయన కూడా అదే పోటీ పెడుతున్నాడు. కానీ ఒక తేడా ఉంది. ఆ పెద్దాయన పోటీలు పెట్టినప్పుడు మా పిల్లలందరికీ ఒక గిన్నె ఇచ్చి, గింజలను దాంట్లో ఊయమనేవాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ గింజలను కొరకొద్దని గట్టిగా చెప్పేవాడు కూడా. మేము ఊసిన గింజలను ఆయన శుభ్రం చేసి, వచ్చే పంట కోసం విత్తనాలుగా ఉపయోగించేవాడు. పోటీలో కూడా ఉన్నవాటిల్లో చాలా పెద్దవి, నాణ్యమైన పుచ్చకాయలు పెట్టేవాడు. దాంతో వచ్చే పంటలో ఇంకా పెద్ద, నాణ్యమైన పుచ్చకాయలు పండేవి. ఎప్పుడైతే కొడుకు ఈ వ్యాపారాన్ని తనచేతుల్లోకి తీసుకున్నాడో, పెద్దవాటికి మార్కెట్లో బాగా గిరాకీ ఉంటుందని తెలుసుకుని, చిన్నవి పోటీలో పెట్టి, పెద్దవాటిని మార్కెట్లో అమ్ముకునేవాడు. దాంతో వచ్చే ఏడాది పంటలో పుచ్చకాయలు చిన్నగా పండేవి. అలా చిన్నగా, ఆ తర్వాత ఏడాది ఇంకా చిన్నగా.. ఏడు సంవత్సరాల్లో మొత్తం పంటే లేకుండా పోయింది.
’’. తర్వాత చిన్నగా ఇలా అన్నాడు. ‘‘ మామూలుగా మనుషుల్లో తరాలు, వాటి ఆలోచనావిధానం మారడానికి 25ఏళ్లు పడుతుంది. కానీ మనం మన పిల్లలకు నేర్పే విషయంలో ఏం తప్పు చేస్తున్నామో తెలుసుకోవడానికి 200ఏళ్లు పడుతుంది.’’

ఇదీ ఒక దూరదృష్టితో ఆలోచించే నేత అంతరంగం. ఒక సామాన్యుడు శిఖరంలా ఎదిగితే, సమాజంపై అతను చూపే ప్రభావం ఎంతుంటుందో అనేదానికి నిదర్శనం మనోహర్‌ పర్రికర్‌ జీవితం.

-రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news