జర్నలిస్టు ఉద్యమాలకు ఆద్యుడు, విలువలు పాటించే నిఖార్సయిన జర్నలిస్టు, మెరుగైన సమాజ నిర్మాత, భయమంటే ఎరుగని ధీరుడు రవిప్రకాశ్, రహస్య ప్రదేశాన్నుంచి నేడు విడియో ప్రవచనాలు విడుదల చేసాడు. అందులో తాను జర్నలిజానికి నేర్పిన విలువలు, భారత వర్షంలో టివి9 పాత్ర, టివి9 లోగో రూపకల్పనతో పాటు మైహోమ్ రామేశ్వరరావు తనను ఎలా వేధించాడో సవివరంగా ప్రవచించాడు. సావధానంగా ఆలకించండి.. కాదు.. కాదు.. తిలకించండి.
నిజమే… 15 సంవత్సరాల క్రితం జన్మించిన టివి9 అనే తెలుగు వార్తా ఛానెల్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. సంఘటనాస్థలి నుంచి చేసిన ప్రత్యక్ష ప్రసారాలు తెలుగు టివి రంగంలోనే పెను దుమారాన్ని లేపాయి. ఈ క్రెడిట్ అంతా ఆ సంస్థ మాజీ సిఇఓ రవిప్రకాశ్‌కు దక్కవలసిందే. మెరుగైన సమాజం కోసం పుట్టిన ఈ చానెల్, ఆ మెరుగులను పైపూతకు మాత్రమే వాడినట్టు క్రమంగా తెలుగు వీక్షకులకు అర్థమయింది. శ్రీనిరాజు అనబడే ఆ చానెల్ యజమాని, ముందుగానే రవిప్రకాశ్‌కు ధారాదత్తం చేయడంతో ఆయన రాసిందే స్క్రోలింగ్, చూపించిందే వార్త అయింది.
ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రవిప్రకాశ్ కంటే ముందుగానే ఎంతోమంది లబ్దప్రతిష్టులైన జర్నలిస్టులున్నారు. విలువలకు కట్టుబడిఉండటం అక్కడే ఆగిపోయింది. ఆ తరం, ఈ తరం , ప్రస్తుతం మీడియా రంగంలో ఉన్న అందరికీ రవిప్రకాశ్ పాటించే విలువలేంటో, నిక్కచ్చిదనం ఏంటో తెలుసు. టివి9 అక్రమాల పుట్ట, బ్రోకర్ల పంట అని, ఆ వ్యవసాయదారుడు ఈయనేనని ఆసేతుహిమాచలానికి అవగతం. ఏదైనా అక్రమం వీరి ‘కంటి’కి చిక్కితే, రెండు-మూడు స్క్రోలింగ్‌ల తర్వాత ఎందుకు ఆగిపోయేదో, తర్వాతెప్పుడూ ఆ వార్తెందుకు కనబడకపోయేదో ఆయన ‘కస్టమర్ల’కు బాగా తెలుసు.
ఏదైనా మీడియా కంపెనీ మేనేజ్‌మెంట్ మారినప్పుడు, కొత్త యాజమాన్యానికి తమతమ ప్రాధాన్యతలుంటాయి. ఇప్పుడున్న ఉద్యోగుల్లో కొందరు వారికి నచ్చకపోవచ్చు లేదా వారి అస్మదీయులకు ఆ సీటు ఇవ్వాలనుకోవచ్చు. అందునా, సిఈఓ లాంటి హోదాలో ఒక అక్రమార్క చక్రవర్తిని ఇంకా భరించాలనుకోకపోవచ్చు. రకరకాల కారణాలుంటాయి. ఈ పరిస్థితి ఎన్‌డిటివికే తప్పలేదు. టివి9 ఎంత? యజమానిగా రామేశ్వర్‌రావుకు కూడా తన ప్రాధాన్యతలుంటాయి. తప్పయినా, ఒప్పయినా తను నిర్దేశించిన పరిధిల్లోనే నడవాల్సిఉంటుందని ఆయన కోరుకున్నారు. ఇష్టం ఉంటే, ఉండొచ్చు లేదా ఓ నమస్కారం పారేసి వెళ్లిపోవచ్చు. అన్ని వందల కోట్లు పెట్టి కొన్నది వేల కోట్లు ఈయనకు దోచిపెట్టడానికి కాదు కదా.
టివి9 లోగో గురించి కూడా ఈయనగారిది ఓ విచిత్రవాదన. లోగో రూపకల్పన వెనుక రవిప్రకాశ్ కఠోరశ్రమ ఉండొచ్చు. కానీ అది ఎవరి పేరుపై రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌గా ఉందో గమనించాలి. రవిప్రకాశ్ అన్న పేరుపై ఉన్నప్పుడే ఆయనకు సర్వాధికారాలుంటాయి. కంపెనీ పేరుమీద ఉంటే మాత్రం ఏ హక్కూ ఉండదు. నటుడు శివాజీకి దొంగతనంగా షేర్లు కేటాయించడం నిజం కాదా? లోగోను మోజోటివికి తరలించడం నిజం కాదా? తెలంగాణ పోలీసులు తవ్వితీసిన ఈమెయిళ్లు నిజం కాదా? ఇవేవీ కానప్పుడు దాక్కోవడం దేనికి? ముందస్తు బెయిలుకు ప్రయత్నించడం దేనికి? నేరుగా పోలీసులను చేరుకుని, తర్వాత న్యాయస్థానంలో పోరాడవచ్చు కదా! పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందంగా ఉంది ఆయన ప్రవచనం.
రవిప్రకాశ్ అనే అతను, కుట్రలు, రాజకీయాలు చేసి కంపెనీ నుంచి వెళ్లగొట్టేంత పెద్దవాడేంకాదు. సెలబ్రిటీ అంతకన్నా కాదు. రామేశ్వర్‌రావు చెప్పగానే పోలీసులు దిగజారిపోయి, ఈయన వెంటపడేంత సీన్ లేదు. సైకో శ్రీనివాసరావు విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో, రవిప్రకాశ్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. చట్టప్రకారం తమ పరిధుల్లో వాళ్లు తమ పని చేసుకుపోతున్నారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేవలం రవిప్రకాశ్ మీదే ఉంటుంది. అది కాదనలేని సత్యం.
-రుద్రప్రతాప్