లాక్‌డౌన్ దిశ‌గా అడుగులు వేస్తున్న రాష్ట్రాలు.. దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ త‌ప్ప‌దా ?

క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో ఉధృతం అవుతున్న నేప‌థ్యంలో రాష్ట్రాలు కోవిడ్ చెయిన్‌ను విచ్ఛిన్నం చేయ‌డానికి శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ముందుగా రాత్రి క‌ర్ఫ్యూల‌ను విధించాయి. త‌రువాత ప‌గ‌టి పూట ఆంక్ష‌ల‌ను విధించారు. ఇక ఫలితం లేక‌పోవ‌డంతో ఇప్పుడు లాక్ డౌన్ ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తుండ‌డంతో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి.

states following lock downs center may announce nation wide lock down

ప‌శ్చిమ బెంగాల్ లో పాక్షిక లాక్‌డౌన్ ను అమ‌లు చేస్తున్నారు. అవ‌స‌రం లేని సంస్థ‌లు, వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు, స‌ముద‌యాల‌ను మూసివేశారు. మార్కెట్లు రోజూ 5 గంట‌లు మాత్ర‌మే ఉంటాయి. ఉద‌యం 7 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే మార్కెట్లు ఉంటాయి. అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద‌, విద్యా సమావేశాలు నిషేధించబడ్డాయి. ఫార్మసీలు, కిరాణా షాపులకు మినహాయింపుల‌ను ఇచ్చారు.

ఇక గుజ‌రాత్‌లో రాత్రి 8 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. మే 5వ తేదీ వ‌ర‌కు అవ‌స‌రం లేని అన్ని వ్యాపార‌, వాణిజ్య సంస్థ‌లు స‌ముదాయాల‌ను మూసివేశారు. పరిశ్ర‌మ‌లు, ఫైనాన్స్, బ్యాంకింగ్ సంస్థ‌లు, నిర్మాణ కార్య‌క‌లాపాల‌ను 50 శాతం సిబ్బందితో అనుమ‌తిస్తున్నారు. అలాగే క‌ర్ణాట‌క‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. ఒడిశాలో మే 5 నుంచి 19వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంది.

ఉత్త‌రాఖండ్‌లో రాత్రి క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మార్కెట్ల‌ను మూసివేయాల్సి ఉంటుంది. కానీ హోం డెలివ‌రీల‌కు అనుమ‌తులు ఇచ్చారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌, మ‌హారాష్ట్ర‌ల‌లో పాక్షిక లాక్‌డౌన్‌ను, గోవాలో పూర్తి లాక్ డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు. ఢిల్లీలో మ‌రో వారం పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇలా నెమ్మ‌దిగా ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోతోంది. దీంతో దేశ‌వ్యాప్త లాక్ డౌన్ తెర మీద‌కు వ‌చ్చింది. అన్ని రాష్ట్రాలు త‌మ‌కు తాముగా లాక్‌డౌన్‌ను విధించే బ‌దులు దేశ‌వ్యాప్తంగా కేంద్ర‌మే లాక్‌డౌన్‌ను విధిస్తే కోవిడ్ ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చు క‌దా అని నిపుణులు భావిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఏమ‌వుతుందో చూడాలి.