ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. అన్ని దేశాలు ఆర్థిక, వైద్య రంగాల పరంగా కుదేలయ్యాయి. భారత్ అయితే తీవ్రంగా నష్టపోయింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పట్టేందుకు మరో 3 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అది కూడా కోవిడ్ మూడో వేవ్ (Covid Third Wave) ను బట్టి మారుతుందని చెబుతున్నారు. అయితే కరోనా సెకండ్ ప్రభావం తగ్గుతుండడం, రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా తగ్గుతుండడంతో ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లను ఎత్తేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిబంధనలను సడలిస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి మూడో వేవ్ వస్తే ఏం చేస్తారు ? అన్నది సందేహంగా మారింది.
కరోనా మొదటి వేవ్ సందర్భంగా లాక్‌డౌన్ విధించారు. కానీ లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటి కంటే లాక్‌డౌన్ ఎత్తేశాకే కేసుల సంఖ్య పెరిగింది. దీంతో అందరూ ప్రధాని మోదీని విమర్శించారు. లాక్‌డౌన్‌ను ఎత్తేయకుండా ఉంటే బాగుండేదని అన్నారు. తరువాత కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వచ్చింది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా ప్రభావం మొత్తం తగ్గిపోయిందని భావించారు. ఇక కరోనా రాదని అనుకున్నారు. ఈ క్రమంలోనే కరోనాపై విజయం సాధించామని జబ్బలు చరుచుకున్నారు. అయితే విదేశాల్లో కోవిడ్ మొదటి వేవ్ తరువాత ఇంకా అనేక వేవ్‌లు వచ్చిన విషయాన్ని గ్రహించలేకపోయారు. దీంతో భారత్‌లో మళ్లీ కోవిడ్ ప్రభావం ప్రారంభమైంది.
కోవిడ్ రెండో వేవ్ వచ్చాక లాక్‌డౌన్‌లను విధించుకునే అవకాశాన్ని రాష్ట్రాలకే కేంద్రం అప్పగించింది. దీంతో ఆదాయానికి గండి పడినా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్ వైపుకే మొగ్గు చూపి లాక్‌డౌన్‌ను విధించి అమలు చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గడంతో లాక్‌డౌన్‌లను ఎత్తేసేందుకు యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. కొన్ని రోజులు పోతే మళ్లీ యథావిధిగా అన్నీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కోవిడ్ ప్రభావం తగ్గిందని మొదటి వేవ్ తరువాత అన్నింటినీ ఓపెన్ చేశారు. దీంతో రెండో వేవ్ వచ్చింది. రెండో వేవ్‌లో అన్నింటినీ మూసేశారు. కరోనా తగ్గింది. దీంతో అన్నింటినీ తెరుస్తున్నారు. ఇక త్వరలో మూడో వేవ్ రాదని గ్యారంటీ లేదు కదా. కచ్చితంగా వస్తుంది. మరలాంటప్పుడు లాక్‌డౌన్ లను ఎత్తేస్తే పరిస్థితి మొదటికి వస్తుంది కదా. మొదటి వేవ్ తరువాత అన్నింటినీ ఓపెన్ చేశారు కనుకనే రెండో వేవ్ వచ్చింది. ఆ విషయం తెలిసి కూడా ఇప్పుడు అన్నింటినీ ఓపెన్ చేస్తే మూడో వేవ్ కచ్చితంగా వస్తుంది. మరి ఈ విషయం తెలిసి కూడా పాలకులు దీనిపై ఎందుకు ఆలోచించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక మూడో వేవ్ పట్ల ప్రభుత్వాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి, మళ్లీ ప్రజల ప్రాణాలు పోవాల్సిందేనా ? అన్న ప్రశ్నలకు కూడా ఇప్పుడు సమాధానాలు అయితే లేవు. మరి ముందు ముందు పాలకులు ఏం చర్యలు చేపడుతారో చూడాలి.