అసలు నేరస్థులెవరు?

-

ఓరుగల్లు, ఒంగోలు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఈ రెండు నగరాలు మానవజాతికే మచ్చతెచ్చిన హేయమైన దమనకాండలకు వేదికలుగా నిలిచాయి. పసిగుడ్డులో కూడా పడతిని చూసిన పశువొకడైతే, వికలాంగుడే కాదు, వికల మనస్కుడు కూడా అని నిరూపించిన వాడొకడు. వీళ్లను నడిబజారులో ఉరితీయాల్సిందే. తప్పులేదు. కానీ, అసలు ఈ తప్పుల వెనుక ఉన్న ప్రోద్భలం ఏమిటి? నానాటికీ పెరుగుతున్న నేర సంస్కృతికి కారణమెవరు?

ఒకసారి వెనక్కివెళ్దాం. దాదాపు పది సంవత్సరాల క్రితం అత్యాచార నేరాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? కొంచెం ముందుకువస్తే, మూడేళ్ల క్రితం ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? యువతలో వస్తున్న అవాంఛనీయ మార్పులకు కారణమెవరు? ఎవరిని నిందించాలి?

సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో, ప్రతీ జ్ఞానం మంచిదయినా, చెడ్డదయినా ఇంటర్నెట్‌లో విచ్చలవిడిగా దొరుకుతోంది. ఒకప్పుడు కేవలం ఆఫీసుల్లో డెస్క్‌టాప్‌ కంప్యూటర్లకే పరిమితమైన ఇంటర్‌నెట్‌, 3జి, 4జి, ఎల్‌టీఈ పుణ్యమా అని చేతుల్లోకే వచ్చేసింది. మొబైల్‌ కంపెనీల మధ్య పోటీ వల్ల, డాటా మరీ చౌకగా లభిస్తోంది. దాంతో మంచి ఎంత జరుగుతోందో తెలియదుగానీ, చెడు మాత్రం దారుణంగా జడలు విప్పుకుంది. తరాలు మారినాకొద్దీ జరిగే అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. అది జరగాల్సిందే. కానీ ఆ అభివృద్ధికి ఉపఉత్పత్తులే సమాజానికి శత్రువులు.

ఇంటర్‌నెట్‌… నవ సమాజానికి ఎంతో మేలు కలిగించే సాంకేతికత. ఈ శతాబ్దానికే అతిగొప్ప ఆవిష్కరణ. సమాచార మార్పిడి అత్యంతవేగవంతంగా జరుగుతూండడంతో, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మనుషుల అవసరం క్రమంగా తగ్గుతోంది. మేడమ్‌ క్యూరీ సమాజహితం కోసం అణువిచ్చేదన కనిపెడితే, దాన్ని ఆటంబాంబు కోసం వాడినట్లు, మన జాతి ఇంటర్‌నెట్‌ను మంచి కంటే చెడుకే ఎక్కువగా వినియోగిస్తోంది. ఆఖరికి దేశాలకు దేశాలు కూడా ఇంటర్‌నెట్‌ను యుద్ధాలకే వాడుతున్నాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయమేముంటుంది?

ఇక, భారతదేశం విషయానికొస్తే, డాటా వాడకం భయంకరంగా పెరిగిపోయింది. 2014లో సరాసరి నెలకు 260 ఎంబి వాడకముంటే, నేడు 9.8జిబి అయింది. 2024 కల్లా ఇది రెట్టింపు అవబోతోందని ప్రముఖ కమ్యూనికేషన్‌ పరికరాల తయారీ సంస్థ ఎరిక్‌సన్‌ తెలిపింది. ఇంతా చేసి, ఈ వాడకమంతా దేనికోసమో తెలుసా? ఫేస్‌బుక్‌, ట్విటర్‌ లాంటి సామాజిక మాధ్యమాలకు, పోర్న్‌సైట్లు చూడటానికి, ఆ విడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి.. ఇంకా రోజంతా వాట్సప్‌లో చాట్‌ చేయడానికి. ఒక్కటంటే ఒక్కటి కూడా ఇందులో తనకు, తన ఇంటికి, సమాజానికి, దేశానికి పనికివచ్చేది లేదు. కేవలం తమ మానసిక దౌర్భల్యాన్ని ప్రదర్శించడానికి, ఈర్షాసూయాద్వేషాలను వెళ్లగక్కడానికి మాత్రమే వేదికలుగా ఈ సోషల్‌ మీడియాను వాడుతున్నారు.

ఎన్నోరకాల మానసిక సమస్యలకు బలిపశువులవుతున్నారు. ఘోరాలు చూస్తున్నారు. నేరాలు చేస్తున్నారు. దేన్ని ఎలా వాడాలో తెలియని భారత ప్రజానీకానికి ఇటువంటివి అలవాటు చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించకపోవడం బాధాకరం. ప్రతీ నేరానికి, ఘోరానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇంటర్‌నెట్‌ కారణమవుతోంది. దేశంలోకి అశ్లీల సైట్లను రానివ్వద్దని నెత్తీనోరు కొట్టుకుంటున్నా, ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంటోంది. ఏదో కంటితుడుపుగా కొన్ని సైట్లను బ్లాక్‌ చేస్తే, అవి మళ్లీ రూపురేఖలు, పేరు మార్చుకుని అడుగుపెడుతున్నాయి.

హాజీపూర్‌ శ్రీనివాసరెడ్డి, వరంగల్‌ ప్రవీణ్‌, ఒంగోలు దివ్యాంగుడు.. వీళ్లందరి ఫోన్లలో అశ్లీల కంటెంట్‌ ఉంది. చదువుసంధ్యా, సరైన పెంపకంలేని వీళ్లకు ఓ స్మార్ట్‌ఫోన్‌, అందులో సరిపడా డాటా ప్యాక్‌ మాత్రం ఉన్నాయి. ఫేస్‌బుక్‌ అంటే అసలేంటో తెలియని వీళ్లకు ఆందులో అకౌంట్‌ ఉంది. ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం ఉండనేఉంది. ఇంకెందుకు ఆలోచన? ఇంకెందుకు విచక్షణ? పసిగుడ్డు, పండుముసలి అన్న జ్ఞానం కూడా లేకుండా జంతువులకంటే హీనంగా మీద పడిపోతున్నారు.

మనిషికి వివిధ సందర్భాలలో కలిగే కోపం, బాధ, కసి, సంతోషం, ఈర్ష్య, ద్వేషం లాంటి భావోద్వేగాలు సాధ్యమైనంత త్వరగా ఏదోరకంగా బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే మనిషి మానసికంగా కృంగిపోతాడు. పొద్దస్తమానం పోర్న్‌సైట్లు చూస్తున్నవాడి శరీరంలో కలిగే అలజడికి అందరి దగ్గర పరిష్కారం, స్థోమత ఉండదు. వాడి ఆర్థికపరిస్థితి డాటా ప్యాక్‌ వేయించుకునే వరకే. అలా లేనివాళ్లే ఇలా తయారవుతున్నారు. మనిషి విచక్షణ కోల్పోయే కారణాలు రెండేరెండు. ఒకటి కోపం. రెండు మత్తు. మొదటిదానికి తనే కారణమైతే, రెండోదానికి ప్రభుత్వాలు కారణం.

మద్యనిషేధం అమలుచేస్తే, కుటుంబపెద్దల యాక్సిడెంట్‌ చావులు, కుటుంబసభ్యుల ఆకలిచావులు ఉండవు. తెల్లవారుజాము రెండుమూడింటిదాకా పబ్బులు, బార్లు ఎందుకు? మళ్లీ రోడ్లమీద టెస్టులెందుకు? ఇవి కాక, ఇంకా హుక్కాలు, డ్రగ్స్‌ యువతపై గెరిల్లాదాడి చేస్తున్నాయి. టన్నులకు టన్నులు రోజూ పట్టుబడుతూనే ఉంది. అయినా వాడకం తగ్గలేదు. నిజానికి హైసొసైటీలో తిరిగే యువతకు, ఈ నేరస్థులకు పెద్దగా తేడా లేదు. ఉన్నదల్లా డబ్బు మాత్రమే. దానివల్ల వాళ్లకు కావలిసినవన్నీ సులభంగా పొందగలుగుతున్నారు..అంతే. గుణగణాల్లో ఇద్దరూ ఒకటే. వ్యాధిగ్రస్థమైన మనస్థత్వాలు వీళ్లవి. దేశ జనాభాలో అధికశాతం ఉన్నది యువతే. అందులో అధికశాతం ఈ రోగగ్రస్థులు. వీళ్ల వల్ల ఏ సమాజం, ఏ దేశం వృద్ధి చెందుతుంది?

ఇంత వినాశనం ప్రభుత్వ పరోక్ష ప్రోత్సాహంతోనే జరుగుతూంటే, ఇంకా విచక్షణ ఎక్కడిది? మానవత్వం ఎక్కడిది.? ఈ దేశంలో సెలబ్రిటీలు సైతం బాధ్యతాయుతంగా ఉండరు. సోషల్‌ మీడియాలో పడి విచ్చలవిడిగా పోస్టులు. ఇరవైఏళ్ల కొడుకును పక్కన పెట్టుకుని, నేను నాలుగోసారి విడాకులు తీసుకున్నానని ఒక నడివయస్సు నటి పెడితే, నేను దిగ్విజయంగా నాలుగో బిడ్డను కన్నానని గిరాకీ లేని హీరో(?) పెడతాడు. మరో పతివ్రతాశిరోమణి సగం బట్టలేసుకుని బీచ్‌లో దిగిన బొమ్మలు పెడుతుంది. ఈ మోస్ట్‌ రెస్పాన్సిబుల్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియాకు లక్షలో ఫాలోయర్స్‌. ఇవన్నీ ఎవరికవసరం? వాళ్లు ఎటు పోతే మనకెందుకు? ఎక్కడ తిరిగితే మనకెందుకు? మనం నానా గడ్డి కరిచి, సంపాదించిన సొమ్ముతోనే వాళ్లలా జల్సా చేస్తున్నారన్న ఇంగితజ్ఞానం ఎంతమందికి ఉంది? ఎవరిని చూసినా రోడ్డుమీద కూడా ఇయర్‌ఫోన్లు చెవుల్లో కుక్కుకుని ఏదోలోకంలో నడుస్తూనేఉంటారు. వెనకాల ఏమొస్తోందో తెలియదు. హారన్లు వినబడవు.

ఇలా చచ్చిపోయినవాళ్లు వేలల్లో ఉన్నారు. విచిత్రమేమిటంటే ఇది అమ్మాయిల్లోనే ఎక్కువ. దీనివల్ల మరణించినవారూ అమ్మాయిలే. ఎంత కడుపుకోత? డిజిటల్‌ ఇండియా పేరుతో జరుగుతున్న ఈ మారణకాండ ఇంకెంతమంది పసిపిల్లలను బలితీసుకుంటుందో ఎవరికీ తెలియదు. నిర్భయ చట్టం అంత కఠినంగా రూపుదిద్దుకున్నా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే అర్థం, మూల సమస్యకు పరిష్కారం లభించకపోవడం, ఆ దిశగా ప్రయత్నించడంలో చిత్తశుద్ధి లోపించడం. ఇందులో ప్రభుత్వంతో పాటు, ప్రజల బాధ్యత కూడా ఉంది. జనాల మైండ్‌సెట్‌లో మార్పు రానంతవరకు ఎన్ని శిక్షలు విధించినా, ఎంతమందిని చంపినా ఈ ఘోరాలు ఆగవు.

ఇతరదేశాల్లో , ప్రతీ చిన్న అభివృద్ధినీ బూతద్దంలో చూస్తారు. దాని తాలూకు దుష్పరిణామాలను అంచనా వేస్తారు. సాధ్యమైనంతవరకు నియంత్రణలో ఉంచుతారు. మామూలుగానే అక్కడ ప్రజలు బాధ్యతాయుతంగా మెలుగుతారు. ప్రభుత్వం జవాబుదారీగా ఉంటుంది. మన దగ్గర రెండూ లేవు. ఇటువంటప్పుడే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సివుంటుంది. సోషల్‌మీడియాపై పూర్తి నియంత్రణ, పోర్న్‌కంటెంట్‌పై ఉక్కుపాదం మోపాలి. మొబైల్‌ డాటాను ప్రీమియం రేట్లకు అమ్మాలి. మద్యనిషేధం పక్కాగా అమలు చేయాలి.

సిగరెట్లు, గుట్కాలు, మత్తుపదార్థాలు ఎక్కడా లభించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. డాక్టర్లు, మానసిక నిపుణుల సలహాలతో ప్రజలను నిత్యం చైతన్యవంతం చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను అనుక్షణం గమనిస్తూఉండాలి. వాళ్లకు స్మార్ట్‌ఫోన్‌ కాకుండా మామూలు ఫీచర్‌ఫోన్‌ కొనివ్వాలి. మానవత్వం, బంధాల విలువలు నేర్పాలి. ప్రజలందరూ కూడా ఈ మహాక్రతువులో భాగస్వాములైతే, బాధ్యతాయుతంగా మెలిగితే ఇటువంటి దారుణాలు ఆగిపోవడానికి ఎంతో కాలం పట్టదు.

-రుద్రప్రతాప్‌

Read more RELATED
Recommended to you

Latest news