ఎగ్జిట్‌పోల్స్: తిరుపతి, సాగర్‌లలో విజయం ఎవరిది..?

-

దేశంలో నాలుగు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో పూర్తిగా ముగిసింది. మే 2వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మొత్తం పోలింగ్ ముగియడంతో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానం సహా తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరిగింది. కాగా ఈ ఉపఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ కూడా విడుదల అయ్యాయి.

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వచ్చినట్టు ఆరా సంస్థ వెల్లడించింది. 39.93 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో అలానే 6.31 శాతం ఓట్లతో బీజేపీ మూడో నిలుస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానం విషయానికి వస్తే ఇక్కడ కూడా అధికార వైసీపీ విజయడంకా మొగిస్తుందని ఆరా సంస్థ వెల్లడించింది. వైసీపీకి 65.85 శాతం ఓట్లు వచ్చినట్టు అంచనా వేసింది. ప్రతిపక్ష టీడీపీకి 23.10 శాతం, బీజేపీ-జనసేన కూటమికి 7.34 శాతం ఓట్లు వచ్చినట్టు పేర్కొంది. అయితే ఎగ్జిట్‌పోల్స్ కచ్చితంగా నిజమవుతాయని చెప్పలేం. కొన్ని సార్లు ఎగ్జిట్‌పోల్స్ కూడా తలక్రిందులు అయ్యే అవకాశం ఉంది.

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. కాగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ‌పార్టీ నుంచి నోముల భ‌గ‌త్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక బల్లి దుర్గ ప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తుండగా, టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బీజేపీ-జనసేన కూటమి తరపున రత్నప్రభతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news